రెండోది- మధుమేహం శరీరంలోని నాడులనూ దెబ్బతీస్తుంది. ఇదీ అంగస్తంభన లోపాన్ని కలిగించే సమస్యే. వీటికి తోడు మధుమేహులలో వూబకాయం, అధిక రక్తపోటు వంటి ‘మెటబాలిక్ సిండ్రోమ్’ లక్షణాలన్నీ కలిసికట్టుగా ఉండే అవకాశం ఎక్కువ. అవీ సమస్యలను పెంచేవే.
వూబకాయం: మధుమేహానికి స్థూలకాయం కూడా తోడైతే శరీరంలో పేరుకొనే కొవ్వు- ‘ఆరోమటేజ్’ అనే ఎంజైమును స్రవిస్తుంది.. అది రక్తప్రవాహంలో ఉన్న పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్‌ను స్త్రీహార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్లుగా మార్చేస్తుంది. దీనర్థం పురుషుడు ఒక రకంగా స్త్రీ లక్షణాలను సంతరించుకున్నట్టే! వీటన్నింటి వల్లా మధుమేహులు, వూబకాయుల్లో అంగస్తంభన సమస్య తీవ్రమవుతుంది.
హైబీపీ, అధిక కొలెస్ట్రాల్: అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్న వారిలో రక్తనాళాలకు సాగే గుణం, ఆ సున్నితత్వం తగ్గి అవి గట్టిపడతాయి. దీంతో వాటిలో రక్తప్రసారం సజావుగా సాగదు. ఇక రక్తనాళాల గోడలకు పేరుకునే కొలెస్ట్రాల్.. రక్తనాళాల సామర్థ్యాన్ని దెబ్బతీసి, రక్త ప్రవాహానికి అవరోధంగా తయారవుతుంది. దీంతో గుండె ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. ఎంతచేసినా దీనివల్ల- గుండెకు దూరంగా ఉండే అవయవాలకు రక్త ప్రసరణ సరిపడినంతగా అందదు. పైగా గుండెకు ఎంత దూరంగా ఉంటే అంత తగ్గుతుంది. ఫలితంగా- కాళ్ల వేళ్లకు, చేతి వేళ్లకు.. ఇలా కొస అవయవాలకు రక్తప్రసారం తగ్గుతుంది. పురుషాంగం కూడా చేతి వేళ్లలాంటి, కాలి వేళ్లలాంటి ఒక కొస అవయవమే. అందుకే దానికీ రక్తప్రసారం సన్నగిల్లిపోతుంది. ఫలితం- స్తంభన సమస్య.
* అందుకే ఇవాల్టి రోజున అంగ స్తంభన లోపాన్ని.. మున్ముందు రాబోయే గుండె, రక్తనాళాల వ్యాధులకు ఒక ముందస్తు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దేశంలో అధిక సంఖ్యలో గుండె జబ్బు బాధితులున్నారు. దీన్ని బట్టి స్తంభన లోపం ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించవచ్చు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. ఇది ఒక్క రోజులోనో అప్పటికప్పుడో పుట్టుకొచ్చేది కాదు. దీనికి చాలాకాలం ముందు నుంచే గుండె జబ్బు మొదలై ఉంటుంది. వారిలో అంగస్తంభన లోపం కూడా అంతకు ముందే ఆరంభమై ఉండొచ్చు. కాబట్టి- కనీసం దాన్ని గుర్తించి పరీక్షలు చేయించుకున్నా.. గుండె జబ్బుల ముప్పు నుంచి ముందుగానే బయటపడటానికి వీలుండేదని చెప్పుకోవచ్చు.
..................... తరువాత పేజీలో..............