header

Kuntala Waterfalls….కుంటాల జలపాతం

Kuntala Waterfalls….కుంటాల జలపాతం
కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఏర్పడిన సహజసిద్ధ జలపాతం ఇది. కడెం నదిపై కుంటాల గ్రామం వద్ద నేలమీదకు దూకే దృశ్యాలను అనుభవించాల్సిందిగానీ చెప్పటానికి వీలుకాదు.
ఈ జలపాతానికి పౌరాణిక నేపధ్యం ఉంది. శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి శకుంతల పేరు మీదుగా కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికుల కధనం. కుంతల రానురాను కుంటాలగా మారింది. జలపాతం దగ్గరకు వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు పెడుతూ సవ్వడి చేస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్వాన్ని ప్రత్యక్షంగా చూడవలసిందే. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వీనుల విందైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని స్నానం చేస్తూ ఆనందించవచ్చు. వర్షాకాలం, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు
జలపాతం వద్ద మడుగులు చాలా లోతుగా ఉండి నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలైన సంఘటనలు ఉన్నాయి జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది. పక్కనే నీటి సుడిగుండం, సోమేశ్వరాలయం, కాకతీయుల కాలంనాటి రాతి నంది విగ్రహాలున్నాయి. ఇక్కడే మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండం అని పిలుస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు చేసి జాతరు జరుపుకుంటారు. దీనినే సోమన్నజాతర అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకుంటారు.
ఇవి ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదిలాబాద్ నుండి నిర్మల్ కు వెళ్లే దారిలో కొద్దిగా కుడివైపునకు, మండలకేంద్రమైన నేరేడిగొండ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.