లక్నవరం చెరువు వరంగల్ జిల్లాలోని గోవిందరావు పేట మండలంలోని లక్నవరం గ్రామంలో ఉంది. లక్నవరం చెరువు మంచి పర్యాటక కేంద్రం. పదివేల ఎకరాలలో ఈ చెరువు వ్యాపించి ఉన్నది. ఈ చెరువులోనే 13 ఐలాండ్స్ (చిన్న చిన్న ద్వీపాలు కలవు) పర్యాటకుల కోసం ఈ చెరువు మీదుగా 160 మీటర్ల అద్భుతమైన సస్పెన్షన్ (వేలాడే) బ్రిడ్జ్ కలదు. ఈ వేలాడే వంతెనను చూడటానికి రాష్ట్రం నలుమూలలనుండి పర్యాటకులు వస్తారు.
కాకతీయుల కాలం నాటి ఈ చెరువు కొన్నివేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. కేరళ తరహాలో ఉన్న హౌసింగ్ బోటు కలదు. సరస్సు మధ్యలో కాకరకాయల బోడుపై నిర్మించిన రెస్టారెంట్‌లో ఘుమఘుమలాడే వంటకాలను ఆస్వాదించవచ్చు. ఎత్తయిన కొండల మద్య రూపుదిద్దుకొన్న ఈ చెరువు కాకతీయల సాంకేతికకు నిదర్శనం. ఆధునిక ఇంజనీరింగ్ ను గుర్తుకు తెస్తుంది. 9 తూములతో రూపొందించిన ఈ చెరువు ద్వారా నీరు సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్ కు మళ్లించబడి అక్కడనుండి కాలువల ద్వారా వ్యవసాయభూములకు నీరు అందించబడుతుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు
వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురం సమీపంలోని గుట్టల మధ్య ఉన్నది. వరంగల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు. వరంగల్ కు అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్ మరియు రైలు సౌకర్యం ఉంది. లక్నవరానికి ప్రత్యేక బస్సు సర్వీసులు లేకున్నప్పటికీ... ట్రావెల్స్ యజమానులు వాహనాలను అద్దెకు నడిపిస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో వచ్చేవారు.. ములుగు డివిజన్ కేంద్రం దాటిన తరువాత గోవిందరావు పేట మండలంలోని చల్వాయి గ్రామం వద్దగల బుస్సాపూర్ క్రాస్ నుంచి కుడిచేతి వైపుకు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు.