మానవ నిర్మితమైన ఈ చెరువు వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో ఉన్నది. చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి, వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చెరువు మధ్యలో కొండ ఉంది.కాకతీయ గణపతిదేవుని కాలంలో (క్రీ.శ.1213 లో ఈ చెరువు త్రవ్వించబడింది. చెరువు వైశాల్యం సుమారు 30 చదరపు కిలోమీటర్లు.
పాకాల సరస్సు చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది. వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలం ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యంలో ఛిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగు బంట్లు, కొండచిలువలు మరియు తోడేళ్ళువంటి జంతువులు పర్యాటకుల కన్నుల విందు చేస్తాయి. మొత్తం 839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది.
పాకాల సరస్సు విస్తీర్ణం 30 చదరపు కిలోమీటర్లు. వేసవిలోనూ సునాయాసంగా వేల ఎకరాలకు నీరందిస్తుంది. చారిత్రక సంపదగా, రైతన్నల పెన్నిధిగా నిలిచిన ఈ నిండుకుండ.. పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ఆరాధకులు, పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది.
కాలుష్య రహిత సరస్సుల్లో పాకాల సరస్సు ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. భారతదేశంలో ద్వితీయ స్థానం. ఇక్కడి పర్యావరణ. పాకాల కట్టపై విహరించడానికి బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేయబడింది. ఉద్యానవనం సమీపంలోని పాకాల గుట్ట సందర్శనీయ స్థలం. గుట్టపైకి ట్రెక్కింగ్ అవకాశం కూడా ఉంది. ఈ మార్గంలో సరస్సు అందాలను ఆస్వాదించడానికి వ్యూ పాయింట్లున్నాయి
కొండ గొర్రెలు, దుప్పులు, కృష్ణజింకలు, కుందేళ్లు, కొన్ని ఎలుగుబంట్లను చూడొచ్చు.
పాకాల సరస్సు వానాకాలంలో సముద్రమే. ఈ చెరువు కింద సుమారు 15,000 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ సరస్సులో బోటు విహారం సరదాగా ఉంటుంది. బోట్లపై సరస్సు మధ్యలో ఉన్న దీవి వరకు వెళ్లొచ్చు. దీవిలోని ప్రతి చెట్టు, పుట్ట, కొమ్మ పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రంగురంగుల పక్షులు, బారెడు ముక్కున్న విహంగాలు, పోట్లాడుకునే చిలకలు, ఇచ్చికాలడు పిచ్చుకలు.. వలస పక్షులు అతిథులను కువకువరాగాలతో స్వాగతిస్తాయి. ఇక్కడ చెరువులో మొసళ్లు ఉంటాయి. అందుకే సరస్సులోకి దిగడంపై నిషేధం విధించారు. సందర్శకులు తుంగబంధం, సంగెం పంటకాలువల నీటిలో ఈదవచ్చు. సరస్సుకు అవతలివైపు చిలకలగుట్టపై కాకతీయుల కాలంలో నిర్మించిన విడిది మందిరం ఇప్పటికీ కనిపిస్తుంది.
బోటింగ్ పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30
స్పీడ్ బోట్ విహారానికి రూ.300 (నలుగురికి)
పాకాల సరస్సుకు ఒకవైపు అందమైన ఉద్యానవనం ఉంది. ఇందులో అనేక రకాల పూల మొక్కలు, అరుదైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పక్షుల చిత్రాలను చూడవచ్చు. ఉద్యానవనంలోని క్రీడా ప్రాంగణంలో పిల్లలూ, పెద్దలూ ఎంచక్కా ఆడుకోవచ్చు. యాత్రికులు బస చేయడానికి టెంట్ గదులు, సాధారణ, ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక శాఖ హరిత హోటల్ నిర్వహిస్తోంది. గదుల అద్దె రూ.1,500-రూ.1,800 -ఒక రోజు
వరంగల్ నుంచి పాకాల 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నర్సంపేట నుంచి సుమారు 18 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి వరంగల్, నర్సంపేటకు బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల నుంచి పాకాలకు బస్సులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. నర్సంపేట నుంచి పాకాలకు అరగంటకో బస్సు అందుబాటులో ఉంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం నుంచి నర్సంపేటకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.