header

Sumati Satakam సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగాఁ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ!
సుమతీశతక కారుడు "సుమతీ" అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్తానని తెలిపాడు. లోకంలో నీతి మార్గాన్ని ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహం పొందినవాడనై, లోకులు మెచ్చుకొనేలా మరలా మరలా చదువాలని ఆశ కలిగేలా వచిస్తున్నాను.
....................................................................................................
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా! సుమతీ!
సమయానికి సహాయం చేయని చుట్టాన్ని, నమస్కరించినా వరాలీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కగా పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడవాలి.
....................................................................................................
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!
అడిగినా జీతమీయని ప్రభువును సేవించి కష్టపడటం కంటే, వడిగల యెద్దులను కట్టుకొని పొలం దున్నుకొని జీవించటమే మేలు.
....................................................................................................
అడియాస కొలువుఁ గొలువకు,
గుడిమణియముఁ సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ!
వ్యర్ధమైన ఆశగల కొలువు, దేవాలయంలో అధికారం, విడువకుండా చెడ్డవారితో స్నేహాం, అడవిలో తోడు లేకుండా ఓంటరిగా పోవటం తగినవికావు (కనుక, వాటిని మానివేయాలి).
....................................................................................................
అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీ!
పెదవి కదిలిందో లేదో తెలియని విధంగా, మంచి మాటలను మాని, అధికారమనే రోగంతో పలుకకపోవటమే నియమం కల్గినట్టి అధికారి - కన్నులతో చూడక, చెవులతో వినక, పెదవి కదల్చక ఉండే పీనుగుకు సమానమే అగుట చేత, అట్టి అధికారిని చూసినంతనే పాపం కలుగుతుంది.
....................................................................................................
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁద గీఁడు దెచ్చుర సుమతీ!
అప్పులు చేసి ఆడంబరాలు చేయడం, ముసలితనంలో వయసులోనున్న భార్య ఉండటం, మూర్ఖుని తపస్సు, తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయంకరమైన కష్టాన్ని కలిగిస్తాయి.
....................................................................................................
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
అప్పులిచ్చేవాడు, వైద్యుడు, యెడతెగకుండా నీరు పారుతుండే నది, బ్రాహ్మణుడూ ఇవి ఉన్న వూరిలో నివశించు. ఇవి లేని వూరిలో ప్రవేశించకు.
....................................................................................................
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ!
అల్లుడు మంచిగానుండుట, గొల్ల విద్వాంసుడౌట, ఆడది నిజం చెప్పుట, పొల్లున దంచిన బియ్యం, తెల్లనికాకులు లోకంలో లేవని తెలియాలి.
....................................................................................................
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
ఆకలిగా నున్నప్పుడు తిన్న అన్నమే అమృతం వంటిది. వెనుక ముందులాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు సహించేవాడే మనిషి. ధైర్యం గలవాడే కులంలో శ్రేష్ఠుడు.
....................................................................................................
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁ కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోఁత మేదిని సుమతీ!
కడుపునిండని తిండి, గర్భం దాల్చికూడా లంజరికం మానని భోగం దాని జీవితం, పాచిపట్టి పాడయిన బావి నీరు, మేకల పాడి రోత కలిగిస్తాయి
....................................................................................................
. ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
ధనం ఇచ్చేదే విద్య, యుద్ధభూమిలో చొరబడేదే పౌరుషం, గొప్ప కవులు కూడా మెచ్చేదే నేర్పరితనం, తగువుకు వచ్చేదే చెరవు.
....................................................................................................
ఇమ్ముగఁజదువని నోరును
'అమ్మా' యని పిలిచియన్న మడుగని నోరున్,
దమ్ములఁమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
ఇంపుగా చదవని నోరు, అమ్మాయని పిలిచి అన్నమడగని నోరు, ఎన్నడూ తాంబూలం వేసుకోని నోరు, కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానం.
....................................................................................................
ఉడుముండదె నూఱేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!
ఉడుము నూరేళ్ళుండును, పాము వెయ్యేండ్లుడును, కొంగ మడుగులో చాలాకాలం జీవించును. కానీ, వాటి వలన ప్రయోజనమేమి? మంచి పనులలో ఆశక్తిగలవాడుండిన ప్రయోజనం కాని.
....................................................................................................
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱఁగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
బంగారంతో సమానంగా తూచి కరగించి కడ్డీలుగా పోసినప్పటికీ ఇత్తడి బంగారంతో సమానం కాదు. అదేవిధంగా, నీచుడెంత ప్రయత్నించినా ఉత్తమ గుణాలను పొందలేడు.
....................................................................................................
ఉదకముఁ ద్రావెడు హయమును,
మదమున నుప్పంగుచుండు మత్తేభబున్,
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచకడకుఁ జనకుర సుమతీ.
నీరు త్రాగుతున్న గుర్రం దగ్గరకు, మదం చేత ఉప్పొంగుతున్న మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకు, చదువు రాని హీనుని వద్దకు వెళ్ళకు.
....................................................................................................
ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!
ఉపకారం చేసిన వానికి తిరిగి ఉపకారం చేయడం గొప్పవిషయం కాదు. కీడు చేసిన వాని తప్పులు లెక్కపెట్టకుండా ఉపకారం చేయటం తెలివైన పని.
....................................................................................................
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కై వడినే పో
నెపములు వెదకునుఁ గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
పోల్చుకొని చూడగా, చెఱకు గడ మొదలు తియ్యగా ఉండి, మధ్యలో తీపి తగ్గి, చివరకు చప్పబడేట్లు, చెడు స్నేహం మొదట యింపుగా, మధ్యలో వికటంగా చివరకు చెరుపు కలిగించేదిగా ఉంటుంది.
....................................................................................................
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుఁగువాఁడె ధన్యుఁడు సుమతీ!
ఏ సమయానికి ఏది తగినదో, అప్పటికి ఆ మాటలాడి, ఇతరుల మనస్సులు నొప్పించక, తాను బాధపడక, తప్పించుకొని నడచుకొనేవాడే కృతార్ధుడు.
....................................................................................................
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ!
ఎప్పుడు కూడా, తన తప్పులను వెతికే అధికారిని కొలువరాదు. తనను చంపటానికి ప్రయత్నించే పాము పడగ నీడన కప్ప నిలబడటానికి ప్రయత్నించకూడదు. ఈ రెండు కార్యాలు కష్టాన్ని కలిగిస్తాయి.
....................................................................................................
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!

చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉంటే, కప్పలు అనేకం చేరుతాయి. అలాగే భాగ్యం కలిగినప్పుడే చుట్టాలు వస్తారు.
లేతకాయలను కోయరాదు. చుట్టాలను నిందించరాదు. యుద్ధంలో పారిపోరాదు. గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు.
ఒక గ్రామానికి ఒక కరణం, ఒక న్యాయాధికారి కాకుండా, క్రమంగా ఎక్కువ మంది ఉంటే, అన్ని పనులు చెడిపోయి చెల్లాచెదురు కాకుంటాయా? (ఉండవు.)
....................................................................................................
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనె గుణమున సుమతీ!
ఇష్టపడని భార్యని, విశ్వాసంలేని యజమానిని, ఇష్టపడని స్నేహితుని, విడవటానికి ఇష్టపడనివాడే గొల్ల కాని, ఆ కులంలో పుట్టిన మాత్రాన గొల్లకాడు.
....................................................................................................
ఓడలఁ బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ!
ఓడల మీద బండ్లు, బండ్లమీద ఓడలు వస్తాయి. అలాగే ఐశ్వర్యం వెంట దారిద్ర్యం, దారిద్ర్యం వెంట ఐశ్వర్యం వస్తాయి
....................................................................................................
కడు బలవంతుండైననుఁ
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ!
ఎంత బలవంతుడైనా, పడుచు పెళ్ళాన్ని ఆమె పుట్టింటి దగ్గర ఎక్కువ కాలం ఉండనిస్తే, తానే ఆమెను వ్యభిచారిణిగా దుకాణానికి పంపినట్లవుతుంది.
బంగారపు గద్దెమీద కుక్కను కూర్చోబెట్టి, మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేసినా దానికి సహజమైన అల్పగుణం మానదు. అలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా వాని నీచగుణం వదలడు.
....................................................................................................
కప్పకు నొరగాలైనను,
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!
కప్పకు కుంటికాలైనా, పాముకు రోగమైనా, భార్య చెడ్డదైనా, ముసలితనంలో దరిద్రం వచ్చినా, తప్పకుండా దుఃఖం కలుగుతుంది
....................................................................................................
కమలములు నీరు బాసినఁ
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతీ!
కమలాలు తమ స్థానమయిన నీటిని వదిలితే, తమకు మిత్రుడగు సూర్యుని వేడి చేతనే వాడిపోతాయి. అలాగే, ఎవరైనా తమ తమ ఉనికిని విడిచినచో, తమ స్నేహితులే విరోధులవక తప్పదు.
....................................................................................................
కరణముఁ గరణము నమ్మిన
మరణామ్తక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
కరణం మరొక కరణాన్ని నమ్మితే ప్రాణాపాయమైన ఆపద కల్గును గానీ బ్రతుకలేడు. కావునా కరణం, తనతో సాటియైన కరణాన్ని నమ్మక మరియు రహస్యాన్ని తెలుపక జీవించాలి.
....................................................................................................
కరణముల ననుసరింపక విరిసంబునఁ
దిన్నతిండి వికటించుఁజుమీ,
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!
కందెన లేకపోతే, ఏ విధంగా దేవుని బండైనా కదలదో, అదే విధంగా కరణానికి ధనమిచ్చి అతనికి నచ్చినట్లు నడవకపోతే తన స్వంత ఆస్తికే మోసమొస్తుంది. ....................................................................................................
తరువాత పేజీలో...................