header

Sumati Satakam

సుమతీ శతకం

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
తాత్పర్యము మార్గంలో ఒంటరిగా నడవకు. పగవాని ఇంటిలో స్నేహంతో భుజించకు. ఇతరుల ధనాన్ని మూట కట్టకు. ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాట్లాడకు.
.......................................................................................................
నమ్మకు సుంకరి, జూదరి
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్
నమ్మకు నంగడి వానిని
నమ్మకుమీ వామహస్త నవనిని సుమతి
తాత్పర్యము పన్నులు వసూలు చేయువానిని, జూదమాడు వానిని, కంసాలిని, భోగం స్త్రీని, సరుకులమ్మేవానిని, ఎడమచేతితో పనిచేయువానిని నమ్మకు.
.......................................................................................................
నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
తాత్పర్యము మంచితనం వల్ల పాలను సహితం త్రాగరు. భయపెట్టటం చేత విషమైనా తింటారు. కావునా, భయాన్ని చక్కగా చూపించాలి. .......................................................................................................
నరపతులు మేరఁదప్పిన,
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్,
గరణము వైదికుఁడయినను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
తాత్పర్యము రాజులు ధర్మం యొక్క హద్దు తప్పినా, విధవాస్త్రీ ఇంటిని ఎల్లకాలం పెత్తనం చేసినా, గ్రామకరణం వైదికవృత్తి గలవాడైనా ప్రాణం పోవునంతటి కష్టం తప్పకుండా సంభవిస్తుంది.
.......................................................................................................
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యము శృంగారాది నవరసాలతో, భావాలతో అలంకరించబడిన కవిత్వ ప్రసంగాన్ని, మనోహరమైన పాటను, తెలివిలేనివారికెంత తెలియజేసినా చెవిటివాడికి శంఖమూదినట్లే నిరర్థకమవుతాయి.
.......................................................................................................
నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
తాత్పర్యము సభలోపల, తల్లిదండ్రులతో, అధికారులతో, పరస్త్రీతో, బ్రాహ్మణ శ్రేష్టులతో పరిహాసాలాడకు.
.......................................................................................................
నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్,
నారే నరులకు రత్నము,
చీరే శృంగార మండ్రు, సిద్ధము సుమతీ!
తాత్పర్యము నీరే అన్ని జీవులకు బ్రతకటానికి ఆధారం. నోరే రసవంతమైన సమస్తమైన మాటలు పల్కటానికి స్థానం. స్త్రీయే సర్వజనులకు రత్నం. వస్త్రమే సింగారానికి ముఖ్యం.
.......................................................................................................
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!
తాత్పర్యము ఎటువంటి వారితోనూ పగపెట్టుకోరాదు. బీదతనం సంభవించిన తరువాత విచారించరాదు. సభలలో మోమాటం లేకుండా మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.
.......................................................................................................
పతికడకుఁ, తనుఁ గూర్చిన
సతికడకును, వేల్పుఁకడకు, సద్గురు కడకున్,
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!
తాత్పర్యము నీతి ప్రవర్తన గలవారు, రాజు దగ్గరకు, తనను ప్రేమించే భార్య దగ్గరకు, దేవుని సముఖానికి, గురువు దగ్గరకు, కుమారుని దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళరు
.......................................................................................................
. పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనుభక్తి యెడలఁ దల్లియు,
యనదగు కులకాంత యుండనగురా సుమతీ!
తాత్పర్యము
భార్య ఇంటిపనులు చేసేటపుడు సేవకురాలవుతుంది, భోగించునపుడు రంభలాగా, సలహాలు చెప్పునపుడు మంత్రిలాగా, భుజించునపుడు తల్లిలాగా ఉండాలి.
.......................................................................................................
పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
తాత్పర్యము పరస్త్రీలకు సోదరునిలాగా ఉండి, పరుల భాగ్యాలకు ఆశపడక, పరులకు స్నేహితుడై, పరులు తన్ను కొనియాడితే వుబ్బక, పరులు కోపించినా తాను కోపించని మనుష్యుడే ఉత్తముడు.
.......................................................................................................
పరసతి కూటమిఁ గోరకు,
పరధనముల కాసపడకు, పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ!
తాత్పర్యము పరసతుల పొందు కోరకు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. పరుల తప్పులెంచకు. తగనటువంటి ప్రసంగం చేయకు. ఐశ్వర్యం కోల్పోయిన కారణంగా బంధువుల వద్దకు వెళ్ళకు.
.......................................................................................................
పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁఢు గాంగేయుఁడైన భువినిందవడున్,
బరసతి సుశీలయైనను,
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
తాత్పర్యము బ్రహ్మచర్య వ్రతం గల భీష్ముడైనప్పటికీ, పరకాంతల ప్రసంగంలో ఉంటే అపకీర్తి పాలవుతాడు. అలాగే, మంచిగుణం గల స్త్రీయైనా పరపురుషుని సహవాసం కల్గిఉంటే అపకీర్తి పాలవుతుంది.
.......................................................................................................
తాత్పర్యము మనసులో పరపురుషుని కోరే భార్యను విడవాలి. ఎదురుమాట్లాడే కుమారుని క్షమించకూడదు. భయపడని సేవకుని ఉంచరాదు. పలుమార్లు భార్యతో పొందు మానాలి.
.......................................................................................................
పరుల కనిష్టము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
మెరిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!
తాత్పర్యము ఇతరులకు యిష్టంగాని దానిని మాట్లాడకు. పనిలేక ఇతరుల ఇండ్లకెన్నడూ వెళ్ళకు. ఇతరులు పొందిన స్త్రీని పొందకు. పెంకితనం కలిగిన గుర్రం ఎక్కకు.
.......................................................................................................
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో
గర్వింపఁ నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ!
తాత్పర్యము పుణ్యదినాలలో స్త్రీలను పొందకు. రాజు యొక్క దయను నమ్మి పొంగకు. గర్వించేలా భార్యను పోషించకు. బాగుపడలేనిచోట ఉండకు.
పలుదోమి సేయు విడియము
.......................................................................................................
తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
పొలయలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!
తాత్పర్యము దంతాలు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలం, తలంటుకొని స్నానం చేసిననాటి నిద్ర, స్త్రీలతో ప్రణయకలహంనాడు కూడిన పొందు వీటి విలువ ఇంతని చెప్పలేం సుమా!
.......................................................................................................
పాటెరుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని గోమలి రతియున్,
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ!
తాత్పర్యము పనియొక్క కష్టసుఖాలు తెలుసుకోని అధికారి సేవ, కూటమి తెలియనటువంటి స్త్రీయొక్క సంభోగం, కీడును కలిగించే స్నేహం, విచారించి చూడగా - నదికి ఎదురు యీదు నంతటి కష్టంలాగా ఉంటుంది.
.......................................................................................................
పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
తాత్పర్యము పాలతో కలిపిన నీరు పాల విధంగానే ఉంటుంది. కానీ, శోధించి చూడగా పాలయొక్క రుచిని పోగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం చేస్తే మంచి గుణాలు పోతాయి. కావునా, చెడ్డవారితో స్నేహం వద్దు.
.......................................................................................................
పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
తాత్పర్యము తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.
.......................................................................................................
పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
తాత్పర్యము పిలువని పనులకు పోవటం, ఇష్టపడని స్త్రీతో భోగించటం, రాజు చూడని ఉద్యోగం, పిలువని పేరంటం, ప్రేమించని స్నేహం చేయరాదు.
.......................................................................................................
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యము పట్టణానికి కోమటి, వరిపైరుకి నీరు, ఏనుగుకు తొండం, సిరి సంపదలకు స్త్రీ ప్రాణం వంటివి.
.......................................................................................................
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ!
తాత్పర్యము తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలగటం వలన వచ్చే సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజునే ఆ సంతోషం కలుగుతుంది.
.......................................................................................................
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!
తాత్పర్యము పులి పాలు తెచ్చినా, గుండెకాయను కోసి అరచేతిలో పెట్టినా, తలెత్తు ధనం పోసినా, వేశ్యా స్త్రీకి ప్రేమ ఉండదు.
.......................................................................................................
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినములఁ గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
తాత్పర్యము పూర్వజన్మలో తాను దానమిచ్చిన ఫలం వలన, అడవి మధ్యలో ఉన్నా సకల పదార్ధాలు కలుగుతాయి. పూర్వ జన్మలో దానమియ్యకపోతే తాను బంగారుకొండ ఎక్కినా ఏమీ లభించదు
.......................................................................................................
పొరుగునఁపగవాఁడుండిన
నిర వొందఁగ వ్రాతగాఁడు ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
తాత్పర్యము ఇంటి పొరుగున విరోధి కాపురమున్నా, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుడైనా, రైతు చాడీలు చెప్పేవాడైనా కరణాలకు బ్రతుకుతెరువుండదు.
.......................................................................................................
బంగారు కుదువఁబెట్టకు
సంగరమునఁ బాఱిపోకు, సరసుడవై తే
నంగడి వెచ్చము లాడకు,
వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!
తాత్పర్యము బంగారం తాకట్టుపెట్టకు. యుద్ధంలో పారిపోకు. దుకాణంలో వెచ్చాలు అప్పు తీసుకోకు. అవివేకితో స్నేహం చేయకు.
.......................................................................................................
బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
తాత్పర్యము బలం కలిగిన పాము ఐనా చలి చీమల చేత పట్టుబడి చస్తుంది. అలాగే తాను బలవంతుడనే గదా అని అనేకులతో విరోధ పడితే, తనకే కీడు వస్తుంది.
.......................................................................................................
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్‌
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
తాత్పర్యము కొండంత ఏనుగుకు తొండంలేకపోతే ఎలా నిరర్ధకమో, అలాగే రాజు యొక్క సముఖాన సమర్ధత గల మంత్రిలేకపోతే రాజ్యం నిరర్ధకం.
మంత్రి ఉన్న రాజు యొక్క రాజ్యం, కట్టుబాటు చెడిపోకుండా జరుగుతుంది. మంత్రి లేని రాజు యొక్క రాజ్యం కీలూడిన యంత్రంలాగా నడవదు.
........................................................................................................
తరువాత పేజీలో...................