header

Adi Varaha Swamy

తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా పుష్కరిణికి వాయువ్య మూలన ఉన్న వరాహా దేవుడిని దర్శించుకుని తరువాత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ వరం స్వయంగా శ్రీవేంకటేశ్వరుడే వరాహస్వామికి ఇచ్చాడు. తిరుమల మొత్తం వరాహాస్వామి ఆధీనంలో ఉండేది. శ్రీనివాసుడు తిరుమలలో నివాసం ఏర్పరుచుకోవటానికి వరాహాస్వామి నుండి అనుమతి పొందుతాడు. వరాహస్వామి ఆలయం చిన్నది. ధ్వజస్ధంభం కూడా ఉండదు. వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరుడు వేరు కాదు కాబట్టి వరాహస్వామికి ప్రత్యేక పూజలుండవు. సుమారు ఒక అడుగు ఎత్తున్న శిలా వేదిక మీద రెండడుగులు ఎత్తున్న వరాహస్వామి విగ్రహం దివ్య తేజస్సుతో దర్శనమిస్తుంది. పై రెండు చేతులలో శంఖు, చక్రాలుంటాయి. ఎడమ తొడమీద భూదేవి కూర్చుని ఉంటుంది. ఇక్కడే ఒక చతురస్రాకారపు రాగిరేకు కనబడుతుంది. ఇది శ్రీనివాసుడు వరాహాస్వామికి రాసి ఇచ్చిన అంగీకార పత్రమని అంటారు. లిపి బ్రహ్మలిపి లాగా ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారమే వరాహాస్వామి పూజలకు అవసరమైన ద్రవ్యాలన్నీ శ్రీనివాసుని భాండాగారం నుంచే అందుతాయి.
ప్రయాణ బడలిక వలనో, లేక సమయం లేదనో ఈ స్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుని దర్శనానికి వెళతారు. కానీ అలా వెళ్ళటం వలన ఓ దివ్యమైన అనుభూతిని కోల్పోతాం. కనుక తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా మందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలి. ఇది శ్రీనివాసుడు వరాహామూర్తికి ఇచ్చిన వరం.