header

Anand Nilayam, Tirumala ..... ఆనందనిలయం విశేషాలు

Anand Nilayam, Tirumala ..... ఆనందనిలయం విశేషాలు
శంఘనిధి-పద్మనిధి :
మహాద్వారానికి ఇరువైపులా రెండు విగ్రహాలుంటాయి. జగద్రక్షుకుడి సర్వసంపదలకు రక్షణగా నిలిచిన దేవతామూర్తులు వీరు. ఒకరు శంఘనిధి మరొకరు పద్మనిధి. వీరిద్దరిని నిధిదేవతలంటారు. స్వామివారి వజ్రవైఢూర్యాలను రత్నసంపదను మణుగుల కొద్ది బంగారంను అపారమైన ధనరాశులను కాపాడే బాధ్యత వీరిదే. ఈ దేవతల పాదాల వద్ద విజయనగర ప్రభువు అచ్యుతరాయల వారి విగ్రహాన్ని గమనించవచ్చు.
మహాద్వారం :
హరినివాసానికి తొలివాకిలి మహాద్వారం. దీనినే పడికావలి, ముఖద్వారం, సింహద్వారం, పెరియా తిరువాశల్ అని కూడా పిలుస్తారు. గడప దాటి లోనికి కాలుపెట్టగానే భక్తజనుల హృదయస్పందనలో గోవిందనామం. మహాద్వారంపై గోపుర నిర్మాణానికి అనువైన చౌకట్టు ఏర్పరచారు. గోపురమంటే తిరుమల గోపురమే. యాభై అడుగుల ఎత్తులో నయన మనోహరంగా విశ్వరూపదర్శన అనుభూతిని కలిగిస్తుంది. పదకవితా పితామహుడు అన్నమయ్య శ్రీకృష్ణుడికీ వేంకటేశ్వరునికి అభేద్యాన్ని పాటించాడు.
అతివరో శ్రీవేంకటగిరి మీద వీడె
కౌరవుల పాలిట విశ్వరూపమితడు
అని కీర్తించాడు.
కృష్ణరాయ మండపం :
దీనినే ప్రతిమా మండపమని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు...పరమ వైష్ణవుడు. ఆయన పేరుతో ప్రాచుర్యం పొందిన కృష్ణరాయ మండపం విజయనగర శిల్పకళా రీతికి ప్రతీక. నూరురాయర గండడు....భక్తిగా చేతులు జోడించిన రాగి విగ్రహం ఇక్కడ కనువిందు చేస్తుంది. ఇరువైపులా ముద్దుల దేవేరులు తిరుమలాదేవి, చిన్నాదేవి. ద్వారానికి ఎడమ పక్కన ఉన్న ప్రతిమ చంద్రగిరి పాలకుడు వేంకటపతి రాయలది. పక్కనే ఉన్న రాతి ప్రతిమలు వరదాజి అమ్మాణి, అచ్యుతరాయల దంపతులవి. కారే రాజుల్ రాజ్యముల్ ఎంతమంది ప్రభువులు పుట్టలేదు గిట్టలేదు శ్రీవారి భక్తులకే ఈ అదృష్ఠం.
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజ కీటకముల మరెవ్వడెరుగు
అంటారు తాళ్ళపాకవారు. కల్పానికొకరు చొప్పున చాలా మందే బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళారు. వాళ్ల నామధేయాలను కూడా ఎవరూ గుర్తు పెట్టకోలేరు. అలాంటిది, నరమానవుల పేర్లేవరికి గుర్తుంటాయి? శ్రీనివాసుని దాసానుదాసుల పేర్లే నిత్యములూ సత్యములూ.

అద్దాల మండపం :
ముద్దుగారీ జూడరమ్మ మోహనమురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
అయినా మహల్ అద్దాల అలంకరణల మధ్య ముద్దుమోము స్వామి మరింత ముద్దొస్తాడు. ప్రతిమా మండపానికి ఉత్తరాన ఉంటుంది అద్దాల మండపం. ఒకప్పుడు ఇక్కడ ప్రసాదం అరలుండేవి. అర్చకులు తమ వంతుకు వచ్చే ప్రసాదాలకు విక్రయించుకునేవారట. ప్రస్తుతం ఈ విధానం లేదు. అరలూ లేవు. ప్రసాదం పట్టెడ అనే పేరు మిగిలింది. తూర్పు భాగంలో నిర్మించిన అంతరాళమే అద్దాల మండపం. డోలోత్సవం జరుగుతుందనడానికి గుర్తుగా ...వేలాడే గొలుసులు, చుట్టూ గోడలకు పైకప్పుకు పెద్దపెద్ద అద్దాలు బిగించారు. క్రీస్తుశకం 1831 నాటికే డోలోత్సవ సంప్రదాయం ఉంది. వరాహస్వామి ఆలయం శిథిల స్థితికి చేరుకున్నప్పుడు..మూలమూర్తిని అద్దాల మండపంలో భద్రపరిచారని చెబుతారు.

రంగనాయక మండపం :
అనంతకరము లనంతాయుధము
లనంతుడు ధరించెలరగను
ఆయన కరములు అనంతం, ఆయుధాలు అనంతం, శరణువేడిన వారికి అనంతమైన అభయాన్ని ప్రసాదిస్తాడు. అతడే రక్షకులందరికీ రక్షకుడు. తురుష్కుల దండయాత్రల సమయంలో తమిళనాడులోని శ్రీరంగంలో వెలసిన రంగనాథుడి ఉత్సవమూర్తులకు స్వామి ఆశ్రయమిచ్చి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. పరిస్థితులు చక్కపడ్డాక సాదరంగా సాగనంపాడు. అపురూప ఆతిధ్యానికి గుర్తగా నిలిచిందీ రంగమండపం. సువిశాల మండపంలో పన్నెండు అడుగుల చతురస్రాకార మందిరం ఉంది. ఇప్పటికీ ఇత్సవాలలో సేవల్లో ద్రావిడ దివ్వ ప్రబంధ పారాయణం ఉంది. గతంలో కళ్యాణోత్సవాలు ఇక్కడే జరిగేవి. రద్దీ పెరగటంతో వేదిక మారింది.
తిరుమలరాయ మండపం :
ఉయ్యాల బాలునూచెదరుకడు
నొయ్యనొయ్య నొయ్యనుచు...
స్వామి హంసతూలికలో ఊగుతున్న దృశ్యాన్ని ఊహించుకున్నా చాలు.. హృదయానందకరం. ఆ వేడుకను కళ్లార చూసి తరించాలనే, సాళువ నరసింహరాయలు ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించాడు. అప్పట్లో హంస ఊయల ఉత్సవం ఏటా ఐదు రోజులపాటూ వైభోగంగా జరిగేదట. కృష్ణదేవరాయల అల్లుడు ఆళియ రామరాయలకు ఓ తమ్ముడుండేవాడు. పేరు తిరుమలరాయలు. ఈ మండపాన్ని విస్తరించిన మహానుభక్తుడు. అందుకే ఇప్పటికీ ఆయన పేరుతో పిలుచుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలపుడు ధ్వజారోహణ సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఇక్కడున్న చతురస్ర శిలావేదికపై వేంచేసి నివేదనలూ హారతులూ అందుకుంటారు. ఉదయాస్తమయాలలో ఇక్కడ కొలువుమేళం జరుగుతుంది. ఇక్కడే రాజా తోడరమల్లు విగ్రహము ఉంది. ఈయన ఒక మహావీరుడు. తురుష్కుల నుంచి తిరుమల ఆలయాన్ని కాపాడాడు. ఆశ్రితపాలకుడు ఆ భక్తికి మెచ్చి శ్రీహరివాసంలో చోటిచ్చాడు.

ధ్వజస్తంభము:
గరుడధ్వజ మెక్కి కమలాక్షు పెండ్లికి
పరుషలదివో వచ్చే పైపై సేవించను
...ఇదే ధ్వజస్తంభము. శ్రీనివాసుని జయకేతనం. బ్రహ్మోత్సవ సమయాల్లో ధ్వజారోహణ పూర్వకంగా ముక్కోటి దేవతలకూ ఆహ్వానపత్రం పంపడం తిరుమల సంప్రదాయం. గరుడుని బొమ్మ చిత్రించిన ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. లోపలి వస్తవుని బయటికి తీసుకువెళ్ళాలన్నా, బయటి వస్తువు లోపలికి తీసుకురావాలన్నా ధ్వజస్తంభం సాక్షిగానే జరగాలి. ప్రదక్షిణ తప్పనిసరి. ఊరేగింపులకు వస్తున్నపుడు వెళ్తున్నప్పుడు స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగిస్తాడు. ధ్వజస్తంభానికి అంత ప్రాధాన్యం. కర్రతో చేయడం వలన అప్పుడప్పడు దాన్ని మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నది నాలుగు దశాబ్దాల నాటిది. పైనుంచి కింది దాకా బంగారు పూత పూసిన రాగి రేకు తాపడం చేశారు. ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకుని ఉన్నదే బలిపీఠం. ఇక్కడే బలి సమర్పిస్తారు. ఈశాన్యాన చిన్న శిలాపీఠం మీద క్షేత్రపాలక శిల కన్పిస్తుంది. రుద్రదేవుడు తిరుమల క్షేత్రపాలకుడు. తెల్లవారుజామున స్వామి కైంకర్యానికి వస్తున్నప్పుడు ఏకాంత సేవ తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నప్పుడూ అర్చకులు తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించడం ఓ నియమమం.

పుష్పమండపం :
దేవదేవుడు...పూలదేవుడు. అలంకారప్రియో హరి: ఎన్నిపూలు అలంకరిస్తే అంత పులకిస్తాడు. ఒకప్పటి తిరుమల గిరి...నిజంగానే పుష్పగిరి. పేరిందేవి తోట. అనంతాళ్యారు తోట. తాళ్లపాక వారి తోట, తరిగొండ వేంగమాంబ తోట, సురపురంవారి తోట...ఎటుచూసినా ఉద్యానవనాలే. అసలు, ఆనంద నిలయ ఆవరణలోనే ఓ సంపంగి తోట ఉండేదట. ఆ పూలనే స్వామివారికి సమర్పించేవారట. రానురాను తోట కనుమరుగైంది. ఇప్పటికీ ప్రాంతాన్ని సంపంగి ప్రదక్షిణ అని పిలుస్తారు. యోగానరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా ఓ పూల అర ఉంది. ఉదయం, సాయంత్రం జరిగే తోమాల సేవలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. శ్రీవారికి నిత్యం అలంకరించే దండలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కిరీటం నుంచి రెండు భుజాలవరకు అలంకరించే దండ శిఖామణి. రెండు భుజాలపై అలంకరించే దండ కంఠసరి. బొడ్డున ఉన్న ఖడ్గానికి అలంకరించే దండ కఠారిసరం. అన్నమాచార్యుల వారు ఓ శృంగార కీర్తనలో..ప్రేయసి ఐన అమ్మవారు ప్రియసఖుడైన శ్రీనివాసుని తనింటికి ఆహ్వనిస్తారు. ఆ పిలుపులోను పిసరంత రసికత. చిరునామా చెప్పారు కానీ, చెప్పీ చెప్పనట్లు చెప్పారు.
మరుని నగరిదండ మాయిల్లెరగవా..
విరుల తావులు వెల్లవిరిసిటి చోటు..
అంటూ చెప్పారు. పూలపరిమళాలు విరిసేచోటే పద్మావతీ దేవి ఉంటుంది. దేవేరి ఉన్నచోటే దేవదేవుడు ఉంటాడు.

పడిపోటు:
సంపంగి ప్రదిక్షిణ మార్గంలోనే సరుకులు నిల్వ చేసే ఊగ్రాణానికి ఆనుకుని పడిపోటు ఉంటుంది. స్వామివారికి నివేదించే లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియ, జిలేబి, తేన్తొళ మొదలైన ప్రసాదాలను ఇక్కడే వండుతారు. ఓ మూలన పోటు తాయార్ అనే అమ్మవారి విగ్రహం ఉంటుంది.
కళ్యాణమండపం:
కొమ్మకు నీవిట్టే పెండ్లి కొడుకవై వచ్చితివి
ఇమ్ముగ సిగ్గుపడక యేలుకోవయా.
వరుడేమో నల్లనివాడు పద్మనయనములవాడు. వధువు పుత్తడి బొమ్మ యీ పొలతి చక్కదనము. చక్కదనాల పెళ్ళికి చక్కని వేదిక శ్రీవారి కళ్యాణమండపం. ఉభయ దేవేరులతో శ్రీవారికి ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది. శుభాల స్వామికి ముహూర్తాలతో పనేమి? రాక్షసాంతకుడికి రాహుకాలాలతో నిమిత్తమేమి? ప్రతిదినం సుదినమే. ప్రతి ముహూర్తం సుముహూర్తమే. పూర్వపు రోజుల్లో బ్రహ్మోత్సవాది విశేత్సవాలలో మాత్రమే కళ్యాణం జరిగేదట. అన్నమయ్య కాలంలో నిత్యోత్సవమైంది. పదకవితా పితామహుడు కన్యాదాతగా మారి పురుషోత్తముడికి పిల్లనిచ్చిన మామ అయ్యాడు.

వెండివాకిలి :
ధ్వజస్తంభం దాటి కాస్త ముందుకు వెళ్లగానే కనిపించే రెండో ప్రవేశద్వారమే వెండివాకిలి. వాకిళ్లకు గడపలకు వెండిరేకు తాపడం చేయడంతో వెండివాకిలనే పేరు వచ్చింది. 1929 ప్రాంతంలో నైజాం రాష్ర్టానికి చెందిన ద్వారకాదాస్ పరభణీ అనే భక్తుడు రజితసేవ చేసినట్లు తెలుస్తోంది. మహాద్వారమంత పెద్దది కాదుకాని, కళాత్మకంగా తీర్చిదిద్దారు. వాకిళ్లమీద శ్రీనివాస కల్యాణం, బావాజీ శ్రీనివాసుల పాచికలాట, శ్రీరామ పట్టాభిషేకం తదితర చిత్రాలు కనువిందు చేస్తాయి. ద్వారాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు
విమాన ప్రదక్షిణ :
గర్భాలయ గోపురమే ఆనందనిలయ విమానం. వి...మానం అంటే కొలవటానికి అసాధ్యమైనదని అర్థం. ఆ గోపుర శిల్పకళావైభోగాన్ని, ఆ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయాన్ని మాటలలో వర్ణించలేము. చూసి తరించవలసినదే. ఈ గోపురాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని అంటారు. తర్వాత చాలా మంది పాలకులు పునరుద్దరించారు. కొత్త సొబగులు అద్దారు. సాళువ మంగిదేవుడు కొత్త స్వర్ణకలశాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు 30 వేల బంగారు వరహాలతో ఆనందనిలయ విమానానికి బంగారుపూత పూయించాడు. మహంతుల పాలనలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు ఆధారాలున్నాయి. చివరిసారిగా 1958లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఎంతో కాలంగా పోగై ఉన్న ఆభరణాలను కరిగించి బంగారు రేకులు సమర్పించారు. గోపురం ఉత్తర దిక్కున వాయువ్యమూలన విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. స్వామి మూలవిరాట్టును పోలి ఉంటాడు. ఆలయం లోపలి నుంచి విమానమూర్తకి నివేదనలు జరుగుతాయి.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాథుడు కన్పిస్తాడు. దక్షిణం నుంచి ప్రదక్షిణగా వెళ్తే వరదరాజస్వామి ఆలయం, బంగారుబావి, అంకురార్పణ మండపం, యాగశాల, సన్నిధి భాష్యకారులు (శ్రీరామానుజుల సన్నిధి) యోగ నరసింహస్వామి ఆలయం మొదలైనవి దర్శనమిస్తాయి. వీటన్నిటిని కలిపి చుట్టుగుళ్ళుగా పిలుస్తారు.

సంకీర్తనా భాండాగారం:
సకల వేదములు సంకీర్తనలు జేసి
ప్రకటించి నినుపాడి పావనుడైన
అకలంకుడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీ వేంకట నిలయ
ఇదే తాళ్లపాక కవుల సంకీర్తనా నిధి. రోజుకు ఒకటి తక్కువ కాకుండా ముప్పైరెండువేల సకీర్తనలను హరిపాదాలకు సమర్పించిన పరమ భక్తుడు అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య, పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య తదితరులు శ్రీవారి సాహిత్యాన్ని రాగిరేకులలో రాయించి ఇక్కడ భద్రపరచారు. ఆ అరపై రెండు విగ్రహాలున్నాయి. ఒకటి అన్నమయ్యది. ఇంకొకటి ఆయన కుమారుడు పెదతిరుమలయ్యది. బ్రహ్మోత్సవాల సమయంలో సంకీర్తనా భాంఢాగారం దగ్గర అఖంఢ దీపారాధనలు నిర్వహించిన రోజులున్నాయి. ఇప్పటికీ, ప్రత్యేక సందర్భాలలో మలయప్పస్వామి సంకీర్తనా భాంఢాగారం దగ్గర హారతులు అందుకుంటాడు. మేలు కొలుపు మొదలు పవ్వళింపు సేవల దాకా ప్రతి సందర్భంలోనూ తాళ్లపాకవారి సంకీర్తనలు గానం చేయాల్సిందే.

పరిమళం అర :
ఆ పరిసరాలకు వెళ్ళగానే సువాసనలు వెదజల్లుతాయి. అదే పరమళం అర ప్రభావం. ప్రతి గురువారం మధ్యాహ్నం స్వామివారి తిరునామానికి ఉపయోగించే పచ్చకర్పూరాన్ని ఇక్కడున్న సాన మీద నూరుతారు. పదహారు తులాల పచ్చకర్పరం పొడితోనే...శుక్రవారం ఉదయం అభిషేకానికి అవసరమయ్యే సుగంధద్రవ్యాలను కూడా సిద్ధం చేస్తారు. చందనాన్ని తయారు చేయడానికి ప్రత్యేక పరిచారికలుంటారు. వీరిని చందనపాణి అని పిలుస్తారు.
పచ్చకప్పురమే నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట...
అంటి అలమేల్ మంగ అండ నుండే స్వామిని.