header

Tirumala Brahmotsavam...Tirupati Brahmotsavam / బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో దసరా పండగ నుండి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రోజుకు రెండు వాహనాల చొప్పున తొమ్మిది రోజుల పాటు తిరువీధులలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది.
మొదటి రోజు అంకురార్పణ :
బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం అవుతాయి. ఈ ఉత్సవాలకు సోముడు(చంద్రుడు) అధిపతి. ఆలయానికి నైరుతీ దిశలో ఉన్న వసంతమండపం వద్ద నుంచి మట్టిని సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి తొమ్మది కుండలలో(పాళికలు) ఆ మట్టిని నింపి నవధాన్యాలను పోసి మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం :
బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఎగురవేసే గరుడ పతాకమే ధ్వజారోహణం. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక కొత్త వస్త్రంపై గరుడుని బొమ్మని చిత్రిస్తారు. దీనిని గరుడధ్వజం అంటారు. నూలుతో పేనిన కొడితాడుకు దీనిని కట్టి ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. గోధూళిలగ్నమైన మీనలగ్నంలో ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గరుడపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలకు, అష్టదిక్పాలకులకు, యక్ష గందర్వులకు ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుమలలో కొలువై ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్దశేషవాహనం :
శ్రీనివాసుని పానుపు శేషుడు. శేష వాహనంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం రోజున స్వామివారు శ్రీదేవి, భూదేవీ సమేతంగా సర్వాలంకారభూషితుడై పెద్ద శేషవాహనం ఎక్కి తిరుమల ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగుతారు.
రెండవరోజు :
చిన్న శేషవాహనం రెండవ రోజు ఉదయం స్వామివారు తన ఉభయదేవేరులతో కలసి ఐదుశిరస్సుల చిన్నవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న వాహనాన్ని వాసుకిగా భావిస్తారు.
హంసవాహనం : రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వవిద్యా ప్రదాయని అయిన శారదా మాతరూపంలో హంసవాహన మొక్కి ఊరేగుతారు. హంస అనే శబ్ధానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే మనోమందిరం అని అర్ధం. అల్పమైన కోర్కెలు అనెడి అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని హంసవాహనం ద్వారా స్వామి వారు భక్తులకు చాటుతున్నారని భక్తుల విశ్వాసం.
మూడవ రోజు :
బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం సింహ వాహనంపై తిరుమల నాధుడు ఊరేగుతాడు. యోగాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమన శక్తికి సంకేతంగా భావిస్తారు. శ్రీనివాసుడు విశ్వానికి తనలోని పరాక్రమాన్ని చాటటానికి ఈ వాహనంపై భక్తలకు కనువిందు చేస్తాడని నమ్ముతారు.
ముత్యపు పందిరి వాహనం :
మూడవ రోజురాత్రి ముత్యపు పందిరి వాహనంపై వేంకటవల్లభుడు తిరువీధులలో ఊరేగుతాడు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనస్సు కావాలని, నిర్మల చిత్తం అలవరచుకోవాలని భక్తలకు చాటిచెప్పటం ఈ వాహన అంతర్యం.
నాలుగవ రోజు :
కల్పవృక్ష వాహనం - నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. కోరిన వరాలిచ్చే కల్పవృక్ష వాహనంపై అడగకనే అన్నీ ఇచ్చి ముక్తి ప్రసాదించే దేవదేవుడు కొలువు తీరి ఊరేగే ఈ ఉత్సవం కనుల పండుగగా సాగుతుంది.
సర్వభూపాల వాహనం :
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తనేనని చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. ఈ వాహన సేవ దర్శనం వలన మనలోని అహంకారం నశిస్తుందని నమ్మకం.

ఐదో రోజు :
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. అన్నివాహన సేవలు వాహన మండపం నుంచి ఆరంభమైతే మొహిని అవతారం మాత్రం ఆలయం నుంచి వెలుపలకి వస్తుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీవారు మోహినీ అవతారంలో మాడ వీధులలో ఊరేగుతారు. మంచి కార్యాల వలన ఎలాంటి శుభాలు జరుగుతాయో చెప్పటానికి అలనాటి క్షీరసాగర మధనం సన్నివేశాలను గుర్తుకు తెస్తూ శ్రీవారు భక్తలను కనికరిస్తున్నారని నమ్మకం.
ఐదవ రోజు రాత్రి:
గరుడోత్సవం – శ్రీవారి అన్ని ఉత్సవాలకంటే ఘనమైనది గరుడోత్సవం. బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు రాత్రి గరుత్మంతుడి వాహనంమీద స్వామివారు ఊరేగుతారు. ఈ ఉత్సవంలో మూలవిరాట్ కంఠాభరణమైన మకర కంఠి, లక్ష్మీహారం, సహస్రనామాలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. వేంకటేశ్వర స్వామిని అనేకరీతుల కొనియాడిన గోదాదేవి పుట్టినల్లు అయిన శ్రీవిల్లి పుత్తూరు నుంచి పంపే తులసీమాల,నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఉత్సవమూర్తి మలయప్ప మొడలోని మకరకంఠి (గరుడపచ్చ) దర్శనంతో సర్వశుభాలు కలుగుతాయని భక్తు విశ్వాసం. అందుకే గరుడోత్సం రోజున తిరుమల కొండ లక్షలాది మందిభక్తులతో కిటకిటలాడుతుంది.
ఆరవరోజు :
ఆరవరోజు ఉదయం జరిగే వాహన సేవలో హనుమంతుడి వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటిచెబుతూ, రాముడైనా కృష్ణుడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా అన్నీ తానే అని వాహనం ద్వారా స్వామి చాటి చెబుతారు.
గజవాహనం:
ఆరవ రోజురాత్రి గోవిందుడు గజవాహనధారుడై భక్తులను కనికరిస్తాడు. గజవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే ఎంతపెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఏడో రోజు :
ఏడోరోజు ఉదయం భానుడు తన రథసారధిగా, సప్తాశ్యాలు కూర్చిన రథంపై ఎర్రటి పూలమాలలు ధరించి మలయప్పగా ఊరేగుతాడు. భక్తుల అజ్గ్నానాంధకారాన్ని తొలగించడానికి శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారు
చంద్రవాహనం:
ఏడో రోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూలమాలలు ధరించి చిరునవ్యులు చిందిస్తూ మలయప్ప చంద్రవాహనంపై ఊరేగుతారు. సర్వజనులు శాంతికాములై చల్లగా ఉండాలని దీవిస్తూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారని అంటారు.
ఎనిమిదవ రోజు :
గుర్రాలవంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపుచేయాలనే తత్వజ్గ్నానాన్ని శ్రీనివాసుడు ఎనిమిదవ రోజు రథోత్సవం ద్వారా తెలియజేస్తారు.
అశ్వవాహనం :
ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారు అశ్వవాహనం మీద ఊరేగుతారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు గుర్రంమీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పటమే ఈ వాహన సేవ ఆంతర్యం.
తొమ్మిదవ రోజు :
చక్రస్నానం- ఎనిమిది రోజుల పాటు వాహన సేవలలో అలసిపోయిన స్వామి సెదతీరటం కోసం తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో కూడిన స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు మరో రూపమైన చక్రతాళ్వార్ ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించటంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల పోతాయని భక్తుల నమ్మకం.
ధ్వజారోహణం :
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వనిస్తూ తొలిరోజు ఎగురవేసిన గరుడధ్వజ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.