header

జాబాలి తీర్థం / Jabali Teertham

జాబాలి తీర్థం / Jabali Teertham

జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన పవిత్ర దివ్య క్షేత్రం జాబాలి. ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ క్షేత్రం తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో ఉంది. స్కందపురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది పక్షుల కిలకిలరావాలతో దట్టంగా పెరిగిన చెట్ల మధ్య ఈ దివ్య క్షేత్రం దర్శనమిస్తుంది.
స్థలపురాణం
శ్రీ రామచంద్రుడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతాసమేతంగా ఇక్కడి తీర్థంలో స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. రాముడు స్నానమాచరించిన తీర్థాన్ని రామకుండ్‌గా, సీతాదేవి స్నానమాచరించిన తీర్థాన్ని సీతాకుండ్‌గా పేర్కొంటారు. కొండలపై నుంచి వచ్చి ఈ తీర్థాలలో నీరు చేరుతూంటుంది. కాబట్టి ఈ నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తుల నమ్మకం. వేణుగోపాల స్వామి వారి ఆలయం, హథీరామ్‌ బావాజీ సమాధి కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తుంటారు. ఇది తిరుమలకు కొద్ది దూరంలోనే ఉండటంతో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఏడు మంగళవారాల పాటు ఇక్కడి రామకుండ్‌ తీర్థంలో స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.
ఆంజనేయస్వామి సింధూరంతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సు పై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను చూడవచ్చు. అభయం, ఆనంద స్వరూపం ఆంజనేయుడు. దివ్య మూర్తిత్వంతో ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు.
ఆలయం వెలుపల ఉన్న వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సత్వరం కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. రావి చెట్టు మొదలులో ఉన్న వృక్ష మూల గణపతిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటారు భక్తులు. మహాత్ములు,సాధువులు, యోగులు, మునులు సిద్ధిపొందిన పరమ పవిత్ర ప్రదేశం ఇది. ఈ పవిత్ర స్థలంలో సీతాకుండ్‌, రామకుండ్‌ తీర్థాలు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి....?
జాబాలి తీర్థం తిరుమల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పాప‌నాశ‌నానికి వెళ్లే దారిలో కొలువై ఉంది.