ఒకసారి వాయుదేవుడు స్వామి వారిని దర్శించుకునేందుకు వైకుంఠం వచ్చినపుడు ఆదిశేషుడు అడ్డగించాడట. స్వామివారు వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వతభాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని వుండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదలించ గలగాలి. ఆ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని వుండగా దాన్ని కదిలించేందుకు వాయుదేవుడు విశ్వప్రయత్నం చేస్తాడు. కొంతసేపటి తరువాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతుహలంతో పడగ ఎత్తి చూశాడు. పట్టు సడలింది. వాయువు ఆనందశిఖరాన్ని కదలించి స్వర్ణముఖి నదీతీరాన దించాడట. అదే శేషాచలమని పురాణాలద్వారా తెలుస్తుంది.
స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే పేరుకూడా ఆమె పేరుమీదుగానే రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.
దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు)ను సంహరించిన తరువాత గరుత్మంతుడు పాపపరిహరార్థం విష్ణువు గురించి తపస్సుచేశాడు. స్వామి ప్రత్యక్షమవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి తానే ఏడుకొండలమీద వెలయునున్నానని తెలిపి గరుత్మంతుడి నికూడా శైలరూపంలో అక్కడే వుండమని ఆదేశించిరట. అదే గరుడాచలం.
వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న తరువాత అంజనాదేవికి చాలాకాలం పిల్లలు కలుగలేదు. దాంతో ఆమె ఆకాశగంగ అంచునవున్న కొండలమీద ఏళ్ళ తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించగా ఆ పండును తిన్న ఫలితంగా ఆంజనేయుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.
కృతయుగంలో తిరుమలలోని తుంబురతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతి రోజూ తన తలనరికి శివునికి నైవేద్యం పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చి శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని చెప్పాడట. చాలాకాలం యుద్ధం జరిగిన తరువాత ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయి ప్రాణాలు విడిచేముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రిగా పేరొందినదని అంటారు.
విష్ణుదర్శనంకోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణమహర్షి తన తపానికి భంగం కలిగించని ప్రదేశం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు. అపుడు బ్రహ్మదేవుడు ఈ ప్రదేశం చూపాడు. ఇక్కడ స్వామి దర్శనం పొందిన నారాయణమహర్షి తను తపమాచరించిన పవిత్రస్థలాన్ని తనపేరుతో పిలిచే వరం ఇవ్వమని కోరాడు. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సుచేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది.