header

Srinivasa Mangapuram / శ్రీనివాసమంగాపురం

శ్రీనివాసుడు వివాహానంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్ధరించారు.
ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో కలిసివచ్చి కల్యాణోత్సవం చేయిస్తుంటారు.
చివరలో అర్చకులే ఇచ్చే ‘‘కల్యాణకకంణం’’ ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజూ ఎంతోమంది యువతీయువకులు తమ తల్లిదండ్రులతో కలిసి కల్యాణోత్సవం చేయిస్తుంటారు. తిరుమల క్షేత్రానికి వెళ్లలేనివారు ఇక్కడే స్వామివారికిని దర్శించుకుని తరిస్తుంటారు. తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.
ఎన్నో వ్యవయప్రయాలకు ఓర్చి రోజుల తరబడి ఎదురు చూసినా తిరుమలలో క్షణకాంల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగితే అదే మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఆ లిప్తపాటు దర్శనానికి వెళ్ళలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తృప్తిపొందుతారు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన మెట్లు కలవు. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగురకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవేంకటేశ్వరుడు స్వయంభువు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందని వాడూ, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతార స్వరూపుడే.
స్థలపురాణం : నారాయణవనంలో శ్రీనివాసుని కల్యాణం ముగిసిన తరువాత శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. శాస్త్రప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో ఆరునెలపాటు విడిది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే తిరుమల కొండకింద కళ్యాణి నదీతీరాన ఉన్న శ్రీనివాసమంగాపురంలో ఎక్కువగా గడిపేవారు.
తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండువరాలు ప్రసాదించాడని చెబుతారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికానివారికి కల్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.
ఇక్కడ ఆలయంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు ఎత్తు తిరుమల కొండపై ఉన్న మూలవిరాట్టుకంటే ఒక అడుగు ఎక్కువగా తొమ్మిది అడుగులు ఉంటుంది. స్వామివారు యవ్యన గంభీరవదనంతో దర్శనమిస్తుంటారు.
హైదర్‌ఆలీ సేనలు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టారు కానీ స్వామి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు. ఆ సమయంలో ఆలయం కొంతకాలం మూతపడింది. అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామికి కలలో కన్పించి తాను శ్రీనివాసమంగాపురంలో ఉన్నానని తనుకు పూజాదికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటినుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది. ఆయనకు స్వామివారు కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సావాన్ని మూడురోజుల పాటు జులై మాసంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.
బ్రహ్మోత్సవాలు : తిరుమలలో లాగానే ఇక్కడకూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిదిరోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గర్లోని సువర్ణముఖీ నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తుంటారు.
ఎలావెళ్లాలి ? : తిరుపతికి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులలో లేక ఆటోలలో వెళ్ళవచ్చు.