header

Seven Hills - Teerthalu

Papanasana Teertham / పాపనాశనతీర్థం :

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో వుంది. పవిత్రమైన పాపవినాశనంలో స్నానమాచరిస్తే పాపాలు కడిగి వేయబడతాయని భక్తుల విశ్వాసం. స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా దుస్తులు మార్చుకునే సౌకర్యం కలదు. చక్కని పార్కులతో, పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రకృతిని వీక్షించవచ్చును.

స్వామి పుష్కరిణి

గరుత్ముంతునిచే భూలోకాని తేబడిన పుష్కరిణిగా పేరుగాంచినది. తిరుమల ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఇక్కడ స్నానమాచరిస్తే పవిత్ర గంగానదిలో స్నానమాచరించి నట్లుగా భక్తులు భావిస్తారు. సకలపాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. ముల్లోకాలలోని సకలతీర్థాలు స్వామిపుష్కరిణిలో కలిసివుంటాయని స్వయంగా వరాహాస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతుంది.స్వామివారి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తరువాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఆకాశగంగ

తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో షుమారు 3 కి.మీ. దూరంలో కలదు. స్వామివారి అభిషేకానికి నిత్యకార్యక్రమాలకు మూడు రజితపాత్రల నిండా ఇక్కడి నీరు వాడడం సాంప్రదాయం.

చక్రతీర్ధం

ఈ వున్న జలపాతం దర్శనీయమైన స్థలం. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవెంకటేశ్వస్వామి వారి అర్చామూర్తికి ఇక్కడ స్నానమాచరింప చేస్తారు

తలకోన

తిరుపతి షుమారు 50 కి.మి దూరంలో యర్రవారి మండలంలో వున్నది. షుమారు 300 అడుగుల ఎత్తున్న జలపాతం . పిల్లలకు, పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండుకొండల మధ్యలో ఉన్న ఈ తీర్థంలో నీళ్ళు స్వచ్ఛంగా మెరుస్తు వుంటాయుయి. కోలనులో నీరు ప్రవహిస్తూ వుంటుంది, కాని ఎటువెళుతుందో కనిపించదు. ఈ తీర్థం పైభాగంలో అత్యంత ఎత్తులో పాపనాశనం వుంది. ఇక్కడ 3 శతాబ్ధాలనాటి గిల్లితీగ అనే చెట్టు తలనకోనకే విశేషం. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధయుక్తమే. గిరిజనులు ఈమొక్కను రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. దీని కాయలు 3 అడుగుల నుండి నాలుగున్నర అడుగులదాకా వుంటాయట.
ఇక్కడ తెల్లని ఆర్కిడ్‌ పుష్పాలను చూడవచ్చును. మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొదలగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు, దేవాంగపిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులు మొదలగు వాటికి ప్రసిద్ధి ఈ ప్రాంతం. 40 అడుగుల ఎత్తున చెట్లమీద కట్టిన తాళ్ళవంతెన విశేషం. పడవ విహారాలకు అనుకూలం. పచ్చనిశాలువా కప్పుకున్నట్లున్న తూర్పుకనుమల అందాలని ఆస్వాదించవచ్చు. మంచి టూరిస్ట్‌ కేంద్రం కూడా. తిరుపతి నుండి ప్రతి ఉదయం 7 గంటలకు బస్సు సౌకర్యం వుంది.

కపిలతీర్ధం

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళేదారిలో తిరుపతికి 2.5 కి.మి. దూరంలో వున్నది కపిలతీర్ధం. శివ భగవానుడు కపిల మహర్హిని ఆశీర్వదించిన ప్రదేశంగా చెప్పబడుచున్నది. కృతయుగంలో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా చెప్తారు. ముల్లోకాలలోని సకలతీర్థాలు మక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘడియలపాటు (నాలుగుగంటలు) కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆసమయంలో అక్కడస్నానంచేసి నువ్వుగింజంత బంగారాన్ని దానంఇస్తే అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింప బడుతుందని భక్తుల విశ్వాసం.

జపాలి తీర్ధం

అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడకు వచ్చాడని భక్తుల విశ్వాసం. తిరుమలకు 5 కి. మీ దూరంలో కలదు. ఇక్కడ వెలసివున్న శ్రీ ఆంజనేయస్వామి వారిని హనుమజ్జయంతి రోజున వేలాదిగా భక్తులు దర్శించుకొంటారు.

పాండవతీర్థం

దీనికే గోకర్ణతీర్థమనీ పేరుంది. వేకంటేశ్వరాలయానికి ఈశాన్యదిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం ఉన్నారని చెప్తారు. వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు ఆదివారం నాడు పాండతీర్థంలో స్నానం చేయడంగాని లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారంనాడు స్నానం చేయడంగాని మంచిదని భక్తులు భావిస్తారు.

కుమారధారా తీర్థం

తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయువ్యదిశలో షుమారు 10 కిలోమీటర్ల దూరంలో వుంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానంచేస్తే పుణ్యప్రదమంటారు. ఆనాడు అక్కడ స్వామివారి ఆలయం నుండి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచడం మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి ఆష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా కుమారధారాతీర్థమన్న పేరు వచ్చిందని పేరు.

చక్రతీర్థం

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి వాయువ్యదిశలో వుంది. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారం కానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారంనాడు కానీ ఈ తీర్థంలో స్నానంచేస్తే పాపాలు నశించి, దీర్ఘాయువు, మోక్షసిద్ధి కలుగుతాయని ప్రతీతి.
విష్యక్సేన సరస్సు, పంచాయుధ తీర్థాలు, అగ్నికుండతీర్థం, బ్రహ్మతీర్థం, రామకృష్ణతీర్ధం, వైకుంఠతీర్థం, శేషతీర్థం, సీతమ్మతీర్థం, పుష్ఫతీర్థం, సనకసనందతీర్థం, సప్తర్షి తీర్థాల వంటివి ఇంకా అనేకం వున్నాయి.