Anti Caner Food….క్యాన్సర్ నుండి కాపాడే ఆహార పదార్ధాలు
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే కావచ్చు కానీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చటం ద్వారా క్యాన్సర్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు అని తెలుపుతున్నాయి తాజా అధ్యయనాలు. తాజాపండ్లూ కూరగాయల్లోని ఖనిజాలూ విటమిన్లూ క్యాన్సర్ నివారణలోనే సహాయం చేస్తాయి
మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా లభించే క్యాలరీలు లోపలి ఆక్సిజన్‌తో జతకలిసి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ కూడా పుట్టుకొస్తాయి. స్వేచ్ఛగా సంచరించే ఇవి అవసరమైన కణాలనూ, డీఎన్‌ఏనూ దెబ్బతీస్తూ క్యాన్సర్, గుండెజబ్బుల్లాంటి వాటికి దోహదం చేస్తుంటాయి. ఇలాంటి కణాల నిరోధించటంలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎంతగానో తోడ్పడతాయి.
సీ ఫుడ్...
సాల్మన్, ట్రౌట్ లాంటి చేపల్లోనూ, గ్రీన్ ఆల్గేలోనూ అస్టాజాంతిన్ అనే కెరోటినాయిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి హానిచేసే విశృంఖల కణాలను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా విటమిన్ ఇ, సి లాంటివి మరింత శక్తిమంతంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. వారానికి నాలుగు సార్లు వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు.
టొమాటో...
క్యాన్సర్ మీద తిరుగులేని అస్త్రంగా టొమాటోను చెబుతారు. వీటిలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంటు ఎక్కువగా ఉండటమే ఇందుకుకారణం. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. దీనితోపాటు పుచ్చకాయ, పంపర పనస, అప్రికాట్, ఎర్రజామలోనూ లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది కణాల మధ్య సమాచారాన్ని ప్రేరేపిస్తూనే క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఆకుకూరలు
కంటికి సంబంధించిన వ్యాధులను అరికట్టడమేకాదు క్యాన్సర్‌మీద పోరాడటానికీ తాజా ఆకుకూరలు ఉపయోగపడతాయి. వీటిల్లోని విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ, గ్లూకోకైనోలేట్, ల్యూటీన్... వంటివి క్యాన్సర్ కణాలను పనిచేయకుండా చేస్తాయి. కణితులు పెరగకుండా నివారిస్తాయి కూడా. ఆకుకూరలతోపాటు పండ్లు, మంచి రంగున్న మొక్కజొన్న, బఠాణీ, గుడ్డులోని పచ్చసొనా ల్యూటిన్ భాండాగారాలే. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు సుమారు యాభైశాతం వరకూ తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యారెట్లు...
ఆల్ఫా కెరొటిన్లు క్యారెట్లలో చాలా ఎక్కువ. ఇవి గుమ్మడి కాయలోనూ దండిగానే లభిస్తాయి. వీటిలోని ఫాల్కారినాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందట. క్యారెట్ ముక్కలు లేదా జ్యూస్‌ని ఓ అరకప్పు మోతాదులో రోజుకి రెండు సార్లు తీసుకుంటే అండాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుముఖం పడుతుంది. ఇక బీటా కెరొటిన్లు ఆకుకూరలూ, నారింజ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. బీటా కెరొటిన్లు ఒంట్లోకి చేరగానే విటమిన్-ఎ రూపంలోకి మారతాయి కూడా.
సిట్రస్ పండ్లన్నీ...
సిట్రస్ జాతికి చెందిన పండ్లు అంటే... నిమ్మ, కమలా, నారింజ, గ్రేప్‌ఫ్రూట్ మొదలైన వాటిల్లోని మోనోటెర్ఫీన్లు క్యాన్సర్ కారక కార్సినోజెన్ కణాలను శరీరం నుంచి బయటకు పంపించడానికి దోహదపడతాయి. వీటిలోని లిమోనిన్లు క్యాన్సర్ కణాలను నాశనంచేసే లింఫోసైట్లను శక్తిమంతంచేస్తాయి. పొట్టుతీయని గోధుమ పిండి, నారింజ, బొప్పాయి, మామిడి, పుచ్చకాయ, ఎర్ర క్యాప్సికం వంటివాటిల్లోని బీటా క్రిప్టోజాంతిన్ విశృంఖల కణాలను తొలగించడంతోపాటు క్యాన్సర్లకు కారణమైన ఎంజైమ్‌లను నియంత్రిస్తుంది కూడా.
సోయా ఉత్పత్తులు
సోయాబీన్స్, సోయా ఉత్పత్తుల్లో ఫైలో-ఈస్ట్రోజెన్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్ల మాదిరిగానే పనిచేస్తూ క్యాన్సర్ కణాలు తమకుతాముగా చనిపోయేలా చేస్తాయి. రొమ్ము, ప్రోస్టేట్, ఎండోమెట్రియల్, థైరాయిడ్, మలద్వార క్యాన్సర్ల నివారణకు ఇవి ఎక్కువగా తోడ్పడతాయి.
పచ్చని బ్రకోలీ...
ఫ్రీ రాడికల్స్‌ని సమర్థంగా ఎదుర్కొనే లక్షణం గ్లూటాథియోన్ సొంతం. అందుకే దీన్ని మాస్టర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లుగా పిలుస్తారు. వీటి నిల్వలు అవకాడో, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివాటిల్లో అధికంగా ఉండటంతో ఈ రకం కూరగాయలు
పలురకాల క్యాన్సర్లను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. బ్రకోలీ మొలకల్లోని సల్ఫొరాఫేన్ అనే ఫైటో కెమికల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే ఎంజైములను విడుదల చేయడం ద్వారా పేగు,
మలద్వార క్యాన్సర్లను నియంత్రిస్తుంది.
గింజలతో...
బాదం, వాల్‌నట్, అవిసెలు మొదలైన గింజల్లో ఎక్కువగా ఉండే క్యుయెర్సిటిన్, క్యాంఫెరాల్... లాంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా అందించే ఇవి కణితులను తగ్గించే రిసాల్విన్లను ఉత్పత్తిచేస్తాయి. అవిసెగింజల్లోని లిగ్నన్లు కణితులు పెరగకుండా చేస్తాయి.
ఇతరాలు...
గ్రీన్‌టీ, బ్లాక్ టీల్లోని కెటెచిన్లు క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటాయి. వెల్లుల్లిలోని ఎలియం పదార్థాలు క్యాన్సర్‌తో పోరాడే రోగనిరోధక కణాలను ప్రేరేపించి తద్వారా కణితుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి. పసుపులో సైక్లో-ఆక్సిజినేజ్-2 శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని కుర్‌క్యుమిన్ కణితుల పరిమాణాన్నీ, మంటనూ బాగా అరికడుతుంది. చెర్రీలూ, స్ట్రాబెర్రీలూ, బ్లూబెర్రీలూ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్‌ను నియంత్రించడానికి తోడ్పడేవే.