
ఏడెన్ అనే దోమ కుట్టినపుడు మన శరీరంలోకి వైరస్ ప్రవేశించి డెంగీ జ్వరం వస్తుంది. ఒకరిని కుట్టిన దోమ ఇంకోకరిని కుట్టినా కూడా ఇద్దరికీ డెంగీ జ్వరం వస్తుంది.
దోమ కుట్టిన వెంటనే డెంగీ లక్షణాలు బయటపడవు. నాలుగు నుండి వారం రోజులలో డెంగీ లక్షణాలు కనబడతాయి. ఎక్కువ జ్వరం, కండరాలు, ఎముకలు, కీళ్లనొప్పులు, వాంతులు, తలతిప్పటం, గ్రంధుల వాపు మొదలగునవి డెంగీ జ్వర లక్షణాలు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు డెంగీ దోమలు కుట్టినా కూడా రోగనిరోధక వ్యవస్థ వైరస్ ను సమర్థవంతంగా ఎదర్కుంటుంది, అందువలన డెంగీ జ్వరం రాదు.
డెంగీ జ్వరం చికిత్సతో ఒక వారం రోజులలో తగ్గిపోతుంది. అరుదుగా కొంత మందిలో మాత్రమే జ్వరస్థాయి తీవ్రంగా ఉండి రక్తనాళాలు దెబ్బతిని అంతర్గతంగా రక్తస్రావమవుతుంది. రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతాయి.
రక్తంలో ఎర్ర, తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్ లెట్స్ ఉంటాయి. శరీరానికి ఎక్కడైన దెబ్బతగిలినపుడు రక్తం కారుతుంటే ప్లేట్ లెట్స్ అక్కడకు వెళ్లి రక్త కారకుండా రక్తాన్ని గడ్డకట్టిస్తాయి. డెంగీ జ్వరంలో సాధారణ స్థితిలో ప్లేట్ లెట్స్ తగ్గినా కూడా తిరిగి వాటంతట అవే ఏర్పడతాయి. మరీ ప్రమాదకర స్థాయిలో తగ్గినపుడు రక్త దాతల నుండి రక్తం సేకరించి రక్తంలో ఉన్న ప్లేట్ లెట్స్ ను మాత్రమే వేరుచేసి అవసరమైనవారికి ఎక్కిస్తారు. సాధారణంగా మైక్రో లీటర్ రక్తంలో లక్షన్నర నుండి నాలుగు లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చినవారందరికీ ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. జ్వరం తీవ్రస్థాయిలో ఉండి ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గినపుడే ప్లేట్ లెట్స్ ఎక్కిస్తారు.
డెంగీ జ్వరం వచ్చినపుడు చికిత్సతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేయాలి. అప్పుడే డెంగీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
డెంగీకి బొప్పాయి ఆకులు మేలు చేస్తాయి. బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి వేడినీటిలో మరగించి, ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి. ఇలా తాగలేనివారి బొప్పాయి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా అనాసపండు ముక్కలను కలిపి మిక్సీవేసి ఆ జ్యూస్ ను తాగినా ప్రయోజనం ఉంటుంది.
రాగి వంటకాలు, దాల్ కిచిడి, ఉడికించిన గుడ్డు, ఆకుకూరలు భోజనంలో తీసుకోవాలి. డెంగీ జ్వరం వల్ల విపరీతమైన నీరసం వస్తుంది. ఈ నీరసాన్ని తగ్గించటానికి దానిమ్మ మంచి పరిష్కారం. దానిమ్మలో అధికంగా ఉండే ఐరన్ రక్తానికి మేలు చేస్తుంది.
నారింజ, కమలా, అనాస, బత్తాయి స్ర్టాబెర్రీస్ పండ్లరసాలు తరచుగా తీసుకుంటే వైరస్ ను ఎదుర్కునే లింఫో సైట్ల సంఖ్య రక్తంలో పెరుగుతుంది.
రాగిజావ, సోయాపాలు, కొబ్బరినీరు, జున్ను వంటి ఆహార పదార్ధాలు త్వరగా కోలుకోవటానికి తోడ్పడతాయి. మార్కెట్ లో దొరకే ఎలక్ట్రో లైట్స్ కన్నా కొబ్బరి నీరు మంచిది. వీటిలోని లవణాలు మేలు చేస్తాయి.
పూర్తిగా విశ్రాంతి తీసుకోవటం మంచిది. కాఫీ, టీలు, మత్తు పానీయాలు తీసుకోకూడదు.
దయచేసి ఈ సమాచారం మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. వారిలో ఎవరికైనా డెంగీ జ్వరం వచ్చినపుడు ఉపయోగకరంగా ఉంటుంది.