యాపిల్, దానిమ్మ, ద్రాక్షా పండ్ల తోటలకు ఎక్కువగా పురుగు పడుతుంది. దీనితో ఈ పంటలకు ప్రతిరోజూ పురుగు మందులు కొడతారు. దీనితో ఈ పురుగు మందులు ఈ కాయలలోనికి చొచ్చుకు పోతాయి. బజారు నుండి ఈ పండ్లను తెచ్చి ఉప్పు నీటిలో నానబెట్టి కడిగినా కాయల పైన ఉండే అవశేషాలు పొతాయి కానీ, లోన ఉన్న పురుగుమందు అవశేషాలు పోవు. కనుక వీటిని తక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిది.
జామకాయలు, సపోటా, సీతాఫలం, నాటు రేగు కాయలు,కర్పూజ పండ్లకు అసలు పురుగు మందులు వాడరు. కనుక వీటిని ఎవరైనా నిరభ్యరంతంగా తినవచ్చు.
ఇక నారింజ, బత్తాయి, కమలా పండ్లు చక్కగా పెరగటానికి బలం మందులు వాడతారు కానీ పురుగు మందులు వాడరు. కనుక వీటిని కూడా నిరభ్యరంతంగా ఏ వయసు వారైనా తినవచ్చు. నారింజ రసం నేరుగా పరగడుపున త్రాగరాదు. నారింజ రసంలో సగం నీళ్లు కలుపుకుని త్రాగాలి.
రక్తహీనత తగ్గి దేహానికి రక్తం చక్కగా పట్టలంటే... ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు కేరెట్ జ్యూస్ త్రాగండి.
కేరట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం...
కేరట్ ఒకటి, టమాటో ఒకటి, కీరాదోసకాయ ఒకటి తీసుకుని వీటిని చిన్నముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిని ఒక గ్లాసులోని తీసుకుని అందులో ఒక స్పూను తేనె, ఒక స్పూను ఎండు ఖర్జూరాల పొడి వేసి బాగా కలుపుకుని త్రాగితే శరీరానికి చక్కగా రక్తం పడుతుంది.
దీనికి తోడు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఏదైనా ఒక ఆకుకూర తప్పనిసరిగా తీసుకోవాలి (గోంగూర, తోటకూర, బచ్చలి, మునగ ఆకు ఏదైనా సరే).
గోధుమ గడ్డి రసం కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. మార్కెట్లలో గోధుమగడ్డి పౌడర్ అమ్ముతున్నారు.
ఇలా ఒక నెల రోజులపాటు తింటే శరీరంలో తగినంత రక్తం తయారవుతుంది.
ప్రసార మాధ్యమాలలో మా వంటనూనెలలో జీరో కొలస్ట్రాల్ ఉంటుందని ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు ఏ వంటనూనెలో కూడా ఒక మిల్లీగ్రాము కూడా కొలస్ట్రాల్ ఉండదు. ఏ వంటనూనెలో కూడా అసలు ఏ మాత్రం కొలస్ట్రాల్ ఉండదు.
మన శరీరంలోని లివర్ మన దేహానికి అవసరమయ్యే కొలస్ట్రాల్ ను తయారు చేస్తుంది.
కానీ వంటలలో నూనెలు అధికంగా వాడితే ఆ నూనెలు శరీరంలో చేరి లివర్ లో కొలస్ట్రాల్ ను ఎక్కువగా తయారు చేయటానికి సహాయం చేస్తాయి. కనుక వంటనూనెలు వీలైనంత తక్కువగా వాడాలి. గుండెజబ్బులు తగ్గుతాయి.
వంటనూనెలు తయారవ్వటానికి ఉపయోగపడే గింజలు నువ్వులు, వేరుశెనగ పప్పులు, అవిశ గింజలు, సన్ ఫ్లవర్ గింజలు నేరుగా తింటే మాత్రం కొలస్ట్రాల్ రాదు.
కార్బైడ్ తో మాగపెట్టిన మామిడి పండ్లపై చిన్న చిన్న ఆకుపచ్చని మచ్చలుంటాయి. పసుపు రంగు కూడా ముదురుగా ఉంటుంది.
కార్బైడ్ తో మాగపెట్టిన కాయలు మాగినట్లు కనిపిస్తాయి, కానీ కోసినపుడు లోపల కండమాత్రం తెల్లగా ఉండి రుచి తక్కువగా ఉంటుంది.
ఈ రకం పండ్లను తిన్నపుడు గొంతులో కొద్దిగా మంట ఉండవచ్చు.
కార్బైడ్ తో మాగపెట్టిన పండ్లు నీళ్ల బకెట్ లో వేస్తే తేలతాయి. సహజంగా మాగిన పండ్లు నీళ్లలో మునుగుతాయి.