Kalki Bhagawan…..కల్కి భగవాన్.... ఐ.టి. దాడులలో కోట్ల రూపాయలు..నిజంగానే భగవానా..?

Kalki Bhagawan…..కల్కి భగవాన్.... ఐ.టి. దాడులలో కోట్ల రూపాయలు..నిజంగానే భగవానా..?
చిత్తూరు జిల్లా బత్తలవల్లం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ ఎల్‌ఐసీలో సాధారణ క్లర్కు. ఉద్యోగం వదలి జీవాశ్రమం పాఠశాల ప్రారంభించి తర్వాత దానిని వన్‌నెస్ యూనివర్సిటీగా మార్చాడు. అది సరిగా సాగలేదు ..తరువాత కొంతకాలం ఇతను కనబడలేదు
కొన్ని సంవత్సరాల తర్వాత..తాను దైవాంశ సంభూతుడిననీ.... తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. తర్వాత చిత్తూరుజిల్లా వరదాయపాలెంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. 1990 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలో దేవుడిగా చలామణి అయ్యాడు. విచిత్రంగా దేశ నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా లక్షలాది మంది అతడి భక్తులుగా మారారు.
విరాళాలు కుప్పలు తెప్పలు వచ్చాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. లక్షలాది మంది ప్రజలకు ఒకేసారి దర్శనం ఇవ్వలేనని.. భక్తుల అభీష్టానికి అనుగుణంగా సాధారణ దర్శనానికి ఐదువేల రూపాయలు, ప్రత్యేక దర్శనానికి రూ.25000 రుసుము వసూలు చేశాడు. అతని పాదాలు తాకితే చాలు సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల్లో బలమైన నమ్మకం ఏర్పడింది.
అతడు నిజంగానే అవతార పురుషుడు అని నమ్మేస్థితికి వచ్చారు భక్తులు. భక్తుల దర్శనార్థం వరదాయపాలెంలో ప్రధానాలయం.. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. కర్నాటక రాష్ర్టాల్లో సుమారుగా 40 వరకు ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు. వీటన్నింటికీ ప్రధాన కార్యాలయం చెన్నైలో. తాజాగా ఐటీ అధికారులు ఆశ్రమాలన్నింటిపై దాడులు చేయగా కోట్లాది రూపాయల డబ్బు పట్టుపడింది. విదేశీ కరెన్సీ రూ.20 కోట్లకు పైగా దొరికింది. ఇంత సొమ్ము ఉండి.. రూ.500 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
అతని కుటుంబసభ్యులు అక్రమ సొమ్ముతో విదేశాల్లో కంపెనీలు స్థాపించారని వెలుగులోకి వచ్చింది. అమెరికా, చైనా, యూఏఈ, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారుల సోదాల్లో తెలిసింది. మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అవతారాన్ని అంటూ ప్రచారం చేసుకొని లక్షాలాది మంది భక్తులను ఏర్పరుచుకొని వారికి కొంగుబంగారమై.. కోర్కెలు నెరవేర్చేవాడై పూటపూటకూ పూజించబడుతున్న కల్కీ భగవానుడు.
సాధారణ విజయ్‌కుమార్ కల్కీ భగవానుడిగా మారి దేవుడిని అంటూ నమ్మబలికి లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఆశ్రమాలు నడిపించాడని తెలుసుకొని భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఏమైనా ఇలాంటి సంఘటనలకు పూర్తిగా బాధ్యులు మనమే. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మటం, లక్షలు, కోట్లు విరాళాలుగా ఇవ్వటం...సమంజసమేనా..? మంచి పనులు చేయాలనుకుంటే...రోడ్ల పైన, సిగ్నళ్లదగ్గరా పేద పిల్లలు అడక్కుంటం చూసే ఉంటారు... వారికి చదువు చెప్పించి ప్రయోజకులను చేస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. పేద విద్యార్ధులను చదివించవచ్చు... వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలలో ఉన్నవారికి, మంచినీరు, బట్టలు, పుస్తకాలు, నిత్యావసరాలు నేరుగా ఇవ్వవచ్చు. మీ తల్లి తండ్రుల పేరుతో పేదల వాడలలో వైద్యశిబిరాలు నిర్వహించవచ్చు. ప్రముఖ దేవాలయాలలో అన్నదానానికి విరాళాలు ఇవ్వవచ్చు, యాత్రికుల సౌకర్యకోసం గదులు కట్టించవచ్చు..నేటికీ భారతదేశంలో ఎంతోమంది పిల్లలు గుండెజబ్బులతో బాధపడుతున్నారు..పౌష్టికాహారం లేక చనిపోతున్నారు...వీరికి సాయం చేయండి....కానీ ఇలా దొంగస్వాములకు లక్షలు, కోట్లు విరాళాలు ఇస్తే ఫలితం ఉంటుందా...?