Wonders of Temples….వింత దేవాలయాలు..
విజయవిఠల దేవాలయం
దక్షిణ భారతావనిలోని ఆలయాల్లో సంగీతాన్ని వినిపించే స్తంభాలు. వీటిల్లోనూ- తడితే స్వరాలు పలికేవి కొన్నయితే, వాటికి ఉన్న రంధ్రాల్లో ఊదితే సంగీతాన్ని వినిపించేవి మరికొన్ని. ఇలాంటి వాటిల్లో ప్రధానమైనది హంపీలోని విజయవిఠల దేవాలయం. 15వ శతాబ్దంనాటి ఈ ఆలయంలో రంగమండపంలోని ప్రధాన స్తంభాలన్నీ ఏడు చిన్న స్తంభాలుగా గ్రానైట్‌తో నిర్మించి ఉంటాయి. ఈ ఏడు చిన్న స్తంభాల్నీ తడితే ఒక్కో స్తంభమూ ఒక్కో శబ్దాన్ని పలుకుతుంది. అదే వీటిని గంధపుచెక్కతో మీటితే సప్తస్వరాల్ని లయబద్ధంగా పలుకుతాయట. లోపల ఏమైనా సంగీత పరికరాల్ని ఉంచారేమో... లేకపోతే అదెలా సాధ్యమన్న సందేహంతో బ్రిటిష్‌వారు రెండు స్తంభాల్ని పగులకొట్టి మరీ పరిశీలించారట. అలాంటివేమీ కనిపించలేదు సరికదా, ఎవరు ఎంతగా శోధించినా నేటికీ ఆ రహస్యం ఏమిటనేది ఎవరికీ తెలియలేదు.
నెల్లయప్పార్ మధురై మీనాక్షి
విఠల దేవాలయంలో మాదిరిగానే తమిళనాడులోని నెల్లయప్పార్ మధురై మీనాక్షి ఆలయాల్లో కూడా తడితే సంగీతాన్ని వినిపించే స్తంభాలు ఉన్నాయి. ఇక, ఆళ్వార్ తిరునగరి ఆలయంలో అయితే తడితేనూ ఊదితేనూ సంగీతాన్ని వినిపించే రెండు రకాల స్తంభాల్నీ నిర్మించడం విశేషం. ఈ రాళ్ల వెనకున్న స్వర నిర్మాణ రహస్యం మాత్రం నేటికీ వీడని మిస్టరీనే.
భావనారాయణ స్వామి దేవాలయంలో గర్భగుడిలో చలికాలం వెచ్చగా, ఎండాకాలం లో చల్లగా..
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా, నాగాయలంక మండలంలోని భావదేవరపల్లె బాపట్ల లోని భావనారాయణ స్వామి దేవాలయంలో ఎండకాలంలో గర్భగుడిలో చల్లగానూ, చలికాలంలో వెచ్చగాను ఉంటుందంటారు. ఆనాటి ఈ ఆలయ టెక్నాలజి ఇప్పటికీ అర్ధంకాలేదు.
ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం చోళరాజుల కాలంలో నిర్మించబడిందని తెలుస్తుంది. దేవాలయంలోని స్వామి విగ్రహం కాలి మునివేళ్లపై నిలబడి ఉండటం విశేషం.
Kiradu Temples – Rajasthan : కిరాడు దేవాలయం.
రాజస్తాన్ లోని బార్ మార్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో హాత్మా గ్రామంలో ఉన్న ఈ దేవాలయం వింతలకు నిలయం.
ఈ ప్రాంగణంలో మెత్తం ఐదు దేవాలయాలున్నాయి. నాలుగు శిధిలావస్ధలో ఉండగా, శివునికి అర్పించబడిన ఈ పురాతన దేవాలయం ఒక్కటే బాగుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు గుజరాత్ వంశస్తులులైన సోలాంకిల ఏలుబడిలో ఉండేది. తరువాత విదేశీ దండయాత్రల వలన చాలా వరకు ధ్వంసం చేయబడింది. తరువాత 11 వ శతాబ్ధంలో పునర్నించబడింది
దేవాలయ విశేషాలు
అద్భుతమైన శిల్పకళతో గుజరాత్ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయంలో సాయంత్రం 06-00 గంటల తరువాత ఎవరూ ఉండటానికి సాహసించరు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తరువాత ఈ గుడిలో ఎవరైనా ఉంటే రాళ్లగా మారిపోతారని, ఇందుకు ఒక ముని శాపం కారణమని స్థానికులు చెబుతారు. విచిత్రం ఏమిటంటే ఇది మూఢనమ్మకం అని కొట్టివేసినా, ఈ నాటికి కూడా ఎవరూ ఈ దేవాలయంలో రాత్రిపూట ఉండే సాహసం చేయరు. కొంతమంది పరిశోధకులు ఈ మందిరంలో రాత్రి 12-00 గంటల దాకా ఉండి తరువాత తెలియని భయంతో బయటకు పరిగెత్తుకొచ్చారని తేలింది.