telugukiranam

Combodia Tourism / కంబోడియా

Combodia Tourism / కంబోడియా

ఇంజనీర్ల నైపుణ్యత
ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ 'బారే'లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
పరవశింప చేసే దృశ్యాలు
ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం రమణీయంగా ఉంటుంది. తెల్లవారుఝూమున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.
బ్యాస్‌ - రిలీఫ్స్‌ గ్యాలరి :
ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్‌ - రిలీఫ్స్‌ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంటన్‌' అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర, కింపురుష, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.
కాంభోజదేశం
భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే సందేహం కలుగుతుంది? ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజదేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.
మరొక అద్భుత నిర్మాణం ఆంగ్‌కోర్‌ థోమ్
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్‌. ఖ్మేర్‌ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన 'జయవర్మ - 6 ఆంగ్‌కోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే 'మహానగరం' అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ (బెయాన్‌) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది
బాంటే స్రెయ్‌
సియాంరీప్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బాంటే స్రెయ్‌ ఆలయానికి ఉంది. అంకోర్‌వాట్‌ కన్నా ముందే పదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చూపరులను కట్టిపడేస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ప్రేరుప్‌ అనే ప్రదేశం ఉంది. వర్ణాలు మారుతూ నింగిలోకి ఒరిగిపోతున్న అక్కడి సూర్యాస్తమయ సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే.
కులెన్‌ జాతీయ ఉద్యానవనం
ఇక్కడికి 60 కి.మీ.దూరంలో అభయారణ్యం ఉంది. దీన్ని కులెన్‌ జాతీయ ఉద్యానవనంగా పిలుస్తారు. ఆ మార్గం పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ శయనభంగిమలోని బుద్ధుని విగ్రహం ఆకట్టుకుంటుంది. అక్కడకు దగ్గరలోనే ఉన్న నదిలో వేయి శివలింగాలు ఉన్నాయి.
చుట్టూ అడవి, పరవళ్లు తొక్కుతోన్న నదీప్రవాహం... ఇవన్నీ కలిసి ఆ ప్రదేశానికి ఒకలాంటి ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి
ఫునమ్‌ ఫెన్‌ - కంబోడియా రాజధాని
సియాంరీప్‌ విమానంలో వెళితే గంటన్నర ప్రయాణం కాంబోడియా రాజధాని ఫునమ్‌. రాయల్‌ ప్యాలెస్‌, సిల్వర్‌ పగోడా చూడదగ్గ విశేషాలు. అక్కడే ఉన్న జాతీయ మ్యూజియంలో కంబోడియా దేశ పురాతన శిల్పకళాఖండాలను చూడవచ్చు. ఈ ప్రదర్శనశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.
దగ్గరలో మేకాంగ్‌ నది ఉంది. దీన్ని స్థానికులు టోనిక్‌ స్పా అని పిలుస్తారు. అందులో షికారు చేయడానికి పడవలు ఉంటాయి.
బీచ్ లు
కంబోడియా సముద్రతీరంలోని సిహనాక్‌ విల్లే. ఇక్కడ అన్నీ బీచ్‌లే. కోహ్‌రాంగ్‌. ఇదో అందమైన దీవి. తీరంలో తెల్లని ఇసుకా స్పటికంలా మెరిసే కనువిందు చేస్తుంది.
ఈ దేశంలో వ్యభిచారం నివారణకు కఠినమైన చట్టాలున్నాయి. అయితే, వీటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఒకప్పుడు వ్యభిచారానికి అనుమతి ఉండేది. అయితే.. చిన్నారులను ఈ వృత్తిలోకి బలవంతంగా లాగుతుండటంతో నిషేధం విధించారు. పేదరికం వల్ల చాలా మంది ఇక్కడ ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. పర్యటకులను ఆకర్షిస్తూ పొట్టపోసుకుంటున్నారు. కొందరైతే డబ్బులు కోసం తమ చిన్నారులను అమ్మేసుకుంటున్నారు.