మధ్యధరా సముద్రతీర అందాల్లో మొనాకో ఒకటి. ఫ్రాన్స్ దేశానికి ఆగ్నేయదిశలో ఉన్న మధ్యధరా కోస్తా ప్రాంతాన్నే ఫ్రెంచ్ రివియెరా అని పిలుస్తారు. మోనాకో కూడా ఈ భూభాగంలోనే ఉండటంతో ఇది కూడా అద్భుత పర్యాటక మరియు వినోద కేంద్రంగా మారింది. ఆ దేశ విస్తీర్ణం కేవలం 2.02 చదరపు కిలోమీటర్లే. మొనాకో యూరోపియన్ దేశం. వీరి భాష ఫ్రెంచ్. రాజధాని కూడా మొనాకో. కరెన్సీ యూరోలు. రోమన్ కేధలిక్స్ ఎక్కువగా ఉంటారు.
సంపన్నుల ఆటస్థలంగా పేరొందిన మొనాకోలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులే. ప్రపంచ బిలియనీర్లలో అత్యధికులు మొనాకో వాసులే. కానీ మొనాకోలో చేపలు తప్ప ఇతరత్రా ప్రకృతి వనరులేవీ లేవు. వ్యవసాయం అసలే లేదు. సుగంధద్రవ్యాలు, సిగరెట్ల తయారీ మినహా మరే పరిశ్రమలూ పెద్దగా లేవు. వాటికన్ మాదిరిగానే ఇదీ దేశంగా గుర్తింపు పొందిన ఓ చిన్న నగరం. పేదరికం లేని తొలి దేశం. మానవాభివృద్ధి సూచిక ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం మొనాకో. ప్రజలకు ఆదాయపు పన్ను లేదు. భూమి తక్కువ కావడంతో స్థిరాస్థి ధరలు ప్రపంచంలోకెల్లా ఎక్కువ. నేరాలసంఖ్య మాత్రం తక్కువ. ప్రజలకన్నా పోలీసుల సంఖ్యే ఎక్కువ.
జనాబా సుమారు 40 వేలకి మించదు. వారి సగటు జీవితకాలం 94 ఏళ్లకు పైనే. స్థానిక మొనాకో వాసుల్ని మొనగాస్కెలనీ విదేశాల్లో పుట్టి అక్కడ నివసిస్తోన్న వాళ్లను మొనాకోయన్లనీ పిలుస్తారు. కానీ చిత్రంగా ఆ దేశంలో స్థానికులే మైనారిటీలు. జనాభాలో ఐదో వంతు మాత్రమే వాళ్లు ఉంటారు.
ఇది కొండమీద వెలసిన ఓ పల్లె. విల్ అంటే రాయి అని అర్థం. మధ్యయుగాన్ని ప్రతిబింబించే ఈ పల్లెలో పాతకాలంనాటి భవంతులూ ప్రపంచ యుద్ధంలో వాడిన ఫిరంగులూ మందుగుండ్లూ కనిపిస్తాయి. లాపోస్టే అనే తపాలా భవంతి, క్యాథెడ్రల్, సముద్రజీవుల ఆక్వేరియం, సముద్ర ఉత్పత్తుల మ్యూజియం ప్రధానంగా సందర్శించదగ్గ ప్రాంతాలు.
ఎండ లేకుండా ఎంతో చల్లగా ఉంటుంది ఇక్కడ. జార్డిన్ ఎక్సోటిన్ అనే మరో పార్కు కూడా చూడదగ్గది. అక్కడి నుంచి కొండమీద ఉన్న రాజభవనాన్ని అందులో మధ్యయుగం నాటి ఆనవాళ్లు స్పష్టంగా కనబడతాయి. భవనం వెలుపల ప్రతిరోజూ మధ్యాహ్నం 11.55 గంటలకు సంగీతవాద్యాల మధ్యలో కరేబియన్ల పద్ధతిలో వందన కవాతు జరుగుతుంటుంది.
ఇది మొనాకో అధునాతన నగర విభాగం. ఇక్కడ విభిన్న ఆకారాల్లో నిర్మించిన కట్టడాలూ బహుళ అంతస్తుల భవనాలూ నీటి మార్గాలూ మరపడవలను చూడవలిందే
డె మాంటికాలో క్యాసినో
1863లో ఇక్కడ ప్రారంభించిన డె మాంటికాలో క్యాసినో . ఇప్పటికీ ప్రపంచ జూద గృహాల్లో ఇదే ప్రధానమైనదంటారు. జేమ్స్ బాండ్ సినిమాలలో మూడింటిని ఈ క్యాసినోలో చిత్రీకరించారు. కానీ మొనాకో పౌరులకు ఇందులో ప్రవేశం నిషేధం. అది ఆ దేశానికి ఉద్యోగాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చే కల్పతరువే తప్ప, వాళ్లు డబ్బులు పోగొట్టుకునే వేదిక కాకూడదన్న కారణంతోనే ఈ నిబంధన.
ప్రజలపట్ల ఆ దేశ ప్రభుత్వానికి ఎంతటి నిబద్ధత ఉన్నదన్నది ఈ ఒక్కదాంతోనే తెలుస్తోంది. పర్యటకులకి మాత్రం ప్రవేశ రుసుము పది యూరోలు. దీనికి పక్కనే ఉన్న కార్ల పార్కింగులో ప్రపంచంలోని ఖరీదైన కార్లన్నింటినీ ఏకకాలంలో చూడొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ కార్ల పోటీ ఏటా మాంటికాలో వీధుల్లో జరుగుతుంది. మూడు వేలమంది వీక్షకులు ఆసీనులై చూస్తుంటారు. అందుకోసం రహదారిని ఆనుకునే స్టేడియాలు నిర్మించారు. ఈ దేశ ఆర్థిక ప్రగతికి క్యాసినోలూ, ఫార్ములా వన్ పోటీలూ తద్వారా వచ్చే పర్యటకులూ... ఇవే ప్రధాన కారణాలు.
మూడువైపులా ఫ్రాన్స్ భూభాగం నాలుగో వైపు మధ్యధరా సముద్రంతో ఉన్న ఆ దేశంలో ఇప్పటికీ రాచరిక పాలనే కొనసాగుతోంది. 1297లో రిపబ్లిక్ ఆఫ్ జెనోవా నుంచి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పొందినప్పటి నుంచీ అక్కడ రాచరిక పాలనే కొనసాగుతుండటం విశేషం.
మొనాకోని పాలించే గ్రిమాల్డీ వంశం ఐరోపా రాచరిక వ్యవస్థలోకెల్లా ప్రాచీనమైనది. 2002లో ఫ్రాన్స్- మొనాకోల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం- ఆ కుటుంబంలో వారసులు లేని పక్షంలో ఆ దేశం ఫ్రాన్స్ అధీనంలోకి వెళ్లిపోతుంది. ఇప్పటివరకూ ఆ దేశానికి అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. కాబట్టి రాచరిక పాలన కొనసాగుతున్న స్వతంత్రదేశాల్లో అదీ ఒకటి. 1956లో ప్రిన్స్ రెయినీర్॥।, అమెరికాకి చెందిన గ్రేస్ కెల్లీ సినీనటిని వివాహం చేసుకున్నాడు. వారి రెండో సంతానమే ప్రస్తుత చక్రవర్తి, ఆల్బర్ట్॥. జనసాంద్రత అక్కడ ఎక్కువ!
ప్రపంచంలోకెల్లా జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతం ఇదే. ఇక్కడి జనావాసాలకు ఓ వైపు రోడ్డు ప్రయాణానికి అవసరమైన కార్లూ బైకులూ పార్కు చేసి ఉంటాయి. మరో వైపున సాగరయానానికి అనువైన మరపడవలు ఉంటాయి.
దాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ కారణంగా ఏర్పడిన మైదాన ప్రాంతం ఇది. నీస్ నుంచి వచ్చే హెలీకాప్టర్లు ఇక్కడే ల్యాండ్ అవుతాయి. ఇక్కడ గాజు కిటికీలు అమర్చిన మరపడవలు ఉంటాయి. అందులో కూర్చుని సముద్ర అడుగుభాగంలోని రంగురంగుల చేపల్ని చూసి రావడం వింత అనుభూతిని కలిగిస్తుంది.
1946 నుంచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి పేరొందిన ఈ నగరంలోని స్క్వేర్ రెనాల్డో హన్ దగ్గర ఉన్న గ్రాండ్ ఆడిటోరియాన్నీ క్రొయ్సెటీ క్యాసినోలు చూడవచ్చు. ప్లానారియా హార్బర్, మరపడవలో మధ్యదరా సముద్రంలో గంటసేపు ప్రయాణిస్తే సెయింట్ మార్గురియట్ ద్వీపానికి వెళ్లవచ్చు.
అక్కడ ఫ్రెంచి రివీరా సుందర దృశ్యాలను చూడవచ్చు. ఆంటీబ్ తీరంలోని నౌకాశ్రయం, పాత రాజప్రాకారం చూడదగ్గ ప్రదేశాలు. తీరం బారునా ఓ ఎత్తైన గోడ ఉంటుంది దానికి రెండువైపులా ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. ఈ తీరంలో సముద్ర అలల ఎత్తు తక్కువ. నీరు ఎంతో తేటగా ఉంటుంది