telugukiranam

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం
పశుపతి నాధ్ ఆలయం
ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతినాధ్ శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిథిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగి వుంటుంది. మధ్యలో వున్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు మొఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తర తరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమే ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్భగుడికి ఎదురుగా అతి పెద్ద నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతాలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రాక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్భగుడిలోని శివునిపై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రంగా బావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుకాణలాలలో ముత్యాలు, నవరత్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.
మహావిష్ణు ఆలయం
శేషశయనునిపై పవళించి నట్లున్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలి యాడుతున్నట్లుంటుంది. భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. పురాతనమైన ఈ విగ్రహం చేతులలో శంఖం, చక్రం, గద మొదలైన ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
ముక్తినాథ ఆలయము
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రా నుండి ముక్తినాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడుకున్న పని. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చున్న మూర్తి. నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
సూర్యోదయ వీక్షణ
ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రీకులకు కావలసిన టీ, కాఫీ పలహారాల వంటి వసతులు చాల బాగా వుంటాయి. కొండ ఎత్తుగా వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా వుంటుంది.
భక్తాపూర్
నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతి నాధ్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంబీరంగా వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాసగృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడటానికి వీలున్నది. ఈ ప్రాంతంలోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి.
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడుతుంది నేపాల్.
ఎవరెస్టు శిఖరము
ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-చైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు.