ప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా. శ్రీలంక రాజధాని కొలంబో. ప్రధాన భాష సింహళం. తరువాత ఎక్కువగా తమిళం మాట్లాడతారు. వీరి డబ్బు శ్రీలంక రూపాయి. దక్షిణ దేశాలలో అత్యధిక అక్షరాస్యత కల దేశం. దాదాపు 92 శాతం మంది విద్యాధికులు.
రావణుడి రాజ్యం శ్రీలంక ఇదేనని చాలామంది నమ్ముతారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశంలో 100కు పైగా నదులున్నాయి. జలపాతాలు కూడా ఎక్కువే. జలవిద్యుత్ ఎక్కువ.
అతి ప్రాచీనమైన మహాబోధియా అనే వృక్షం ఉంది ఇక్కడ.
ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన సిలోన్ టీపొడి ఇక్కడే తయారవుతుంది. తేయాకు ఎక్కువగా పండిస్తారు. తేయాకు ఎగుమతులు కూడా ఎక్కువే.
భారతదేశం పటం చూసినప్పుడు.. అందులోనే మరో దేశం కూడా కనిపిస్తుంది! కన్యాకుమారి దిగువన.. సముద్రంలో మధ్యన.. కాస్త అటూఇటూగా ముక్కోణాకృతిలో ఉండే ఆ చిన్న దేశమే శ్రీలంక. మనదేశంలో పుట్టిపెరిగిన బౌద్ధాన్ని ఆదరించి, ఆచరిస్తున్న ప్రాంతమది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శాంకరీదేవి ఆలయం ఉన్నది లంకలోనే.. సంస్కృతి, సంప్రదాయాల కలబోతగా పర్యాటక ప్రియులను అలరిస్తోంది. ప్రకృతి ఆరాధకులకు, ఆధ్యాత్మిక సాధకులకు, పర్యావరణ హితులకు.. అందరికీ అన్నీ ఉన్నాయి.
‘లంకాయాం శాంకరీదేవీ’.. అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది శ్రీలంకలోని ట్రింకోమలీ పట్టణంలోని శాంకరీదేవి ఆలయం. పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా ఉంటుందీ ప్రాంతం. సముద్రంలోకి చొచ్చుకువచ్చిన ఎత్తయిన పర్వతంపై అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. లంకకు వచ్చే పర్యాటకులందరూ ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారు. పదిహేడో శతాబ్దంలో పోర్చుగీసువారి దాడిలో ఇక్కడి ఆలయం ధ్వంసం అయింది. శతాబ్దాల తరబడి ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో శ్రీలంక ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. అప్పటి నుంచి శాంకరీదేవి ఆలయం ప్రముఖ సందర్శనీయ కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీరాముడు ప్రతిష్ఠించిందిగా చెప్పే కోణేశ్వరాలయం ఉంటుంది. శ్రీలంకలోని ప్రధాన నగరాల్లో ఒకటైన దంబుల్లా నుంచి ట్రింకోమలీ 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
లంకలో ప్రధాన ఆకర్షణ సిగిరియా కొండ. ఇది దంబుల్లా నగరం సమీపంలో ఉంటుంది. సింహాకృతిలో ఠీవీగా కనిపించే ఈ భారీ కొండ ఎత్తు 200 మీటర్లు. శ్రీలంక నాగరికతకు నిలువెత్తు నిదర్శనమిది. 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే కశ్యప అనే రాజు.. సిగిరియా కొండపై రాజప్రాసాదం, కోటలు కట్టించాడట. కోటకు వెళ్లే దారి వెంట నీటి కొలనులు, ఉద్యానవనాలు కనిపిస్తాయి. పైగా కొలనుల్లో ఫౌంటెయిన్లు ఉండటం, అవి నేటికీ పని చేస్తుండటం విశేషం. కొండపై నాటి రాజప్రాసాదాల శిథిల నిర్మాణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలతో కొండ పైభాగం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలకు నెలవైన సిగిరియా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
సుందరకాండలో శ్రీలంకను వాల్మీకి సుందరమైన ప్రదేశంగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే పర్వతాలు, లోయలు, నదులు, పచ్చదనంతో లంక ఎంతో అందంగా ఉంటుంది. వీటి మధ్యలో రామాయణగాథకు సంబంధం ఉన్నాయని చెప్పే ప్రాంతాలు కనిపిస్తుంటాయి.
- ఆంజనేయుడు లంకలో తొలిసారిగా రంబోడా అనే ప్రాంతంలో అడుగుపెట్టాడట. ఇక్కడ హనుమంతుడి భవ్యమందిరం కూడా ఉంది. ఇక్కడి జలపాతం మనోహరంగా ఉంటుంది. కాండీ నగరం నుంచి రంబోడాకు సుమారు 50 కిలోమీటర్లు.
- సీతమ్మను రావణుడు తీసుకొచ్చిన మార్గంగా ‘సీత ఎలియా’ పేరు చెబుతారు. సీతమ్మను బంధించి ఉంచిన అశోకవనం కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడే ఆంజనేయుడి పాదముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడ సీతమ్మవారి ఆలయం కూడా ఉంది. కాండీ నుంచి సీత ఎలియా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి మూర్చిల్లిన లక్ష్మణుడిని కాపాడటానికి ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతం తెచ్చాడని రామాయణంలో చదివాం. ఆ సంజీవని పర్వతంలో కొంత భాగం పడిన ప్రాంతంగా రితిగల పేరు చెబుతారు. ఇక్కడి పర్వతంపై అనేక ఔషధ వృక్షాలు నేటికీ కనిపిస్తాయి. లంకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిగిరియా నుంచి రితిగల 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- ఇవేకాకుండా నువార ఏలియా సమీపంలోని రావణ గుహలు, రావణుడి కాలానికి చెందిన సొరంగ మార్గాలు, రావణ జలపాతం, కొలొంబో దగ్గర్లోని విభీషణ ఆలయం, చిలా సమీపంలోని లంకేశ్వరుడి కాలంనాటి విమానాశ్రయంగా చెప్పే గుర్లపోతా తదితర ప్రదేశాలెన్నో నాటి రామయణ ఘట్టాలను ప్రతిబింబిస్తాయి.
వన్యమృగాల ప్రేమికులకు లంక పర్యటన మధురానుభూతిని అందిస్తుంది. దట్టమైన అడవులు, నదీనదాలు ఈ ద్వీపాన్ని పర్యావరణ కేంద్రంగా నిలబెట్టాయి. దంబుల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో మిన్నేరియా నేషనల్ పార్క్లో ఏనుగులు మందలు మందలుగా సంచరిస్తుంటాయి. సిగిరియా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోనూ ఏనుగులను చూడొచ్చు. శ్రీలంక దక్షిణ తీరంలోని యల నేషనల్ పార్క్ జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జడలబర్రెలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ సందర్శకుల తాకిడి ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులను లోనికి అనుమతిస్తారు. ఇక్కడ సఫారీ చేయవచ్చు.
హైదరాబాద్ నుంచి శ్రీలంక నాన్స్టాప్, సింగిల్స్టాప్ విమాన సర్వీసులు, విజయవాడ, విశాఖపట్టణం నుంచి సింగిల్స్టాప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి విమానాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. టికెట్ ఛార్జీలు రూ.4,200 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి.
శ్రీలంక వీసా ఆన్లైన్లో పొందవచ్చు. ఈటీఏ (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) వీసా కోసం కనీసం ఆరునెలల గడువు ఉన్న పాస్పోర్ట్, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం ఉండాలి. రూ.1800 ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. వారం రోజుల్లో వీసా లభిస్తుంది. 30 రోజుల గడువుతో, రెండుసార్లు వెళ్లే సౌలభ్యం కల్పిస్తారు. వీసా కోసం http://www.eta.gov.lk వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
భారత్ నుంచి లంకలోకి వ్యాప్తిచెందిన బౌద్ధధర్మం అక్కడ విశేష ప్రాచుర్యం లంక జనాభాలో దాదాపు 70 శాతం మంది బౌద్ధ మతస్థులే! లంకలో బౌద్ధ ఆరామాలు కోకొల్లలు. శతాబ్దాల పాటు లంక రాజధానిగా వెలుగొందిన అనురాధపురలో చారిత్రక ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దంబుల్లాలోని గుహాలయాలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందాయి. 150 మీటర్ల ఎత్తున్న గుహాలయాల్లో బుద్ధుడి ప్రతిమలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడే గోల్డెన్ బుద్ధ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
- కాండీ-ఎల్లా రైలు ప్రయాణం శ్రీలంకలోని ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది. సముద్ర తీరం వెంబడి, దట్టమైన అడవుల గుండా, పచ్చటి పొలాల మీదుగా సాగే రైలు ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- కాండీ, నువర ఏలియా ప్రాంతాల్లో తేయాకు తోటలు విస్తృతంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
- చుట్టూ సముద్రం ఉన్న లంకలో అందమైన బీచ్లు ఎన్నో ఉన్నాయి. కొలొంబో నుంచి మొదలుపెడితే జాఫ్నా వరకు ఎన్నో తీరాలు పర్యాటకులతో సందడిగా ఉంటాయి. బెన్టోటా బీచ్, ట్రింకోమలీ సమీపంలోని నీలవెళ్లి తీరం, తూర్పుతీరంలోని అరుగమ్, పస్సికూడ, దక్షిణ తీరంలోని మిరిస్సా తదితర బీచ్లు సంద్రంలో సాహసక్రీడలకు అడ్డాగా నిలుస్తున్నాయి.
- కొలొంబోకు 153 కి.మీ దూరంలోని మిరిస్సా తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి బోట్లో సముద్రంలోకి వెళ్తే.. బ్లూవేల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోవచ్చు. ఆ భారీ జలచరాలు ఆటలను చూడొచ్చు.
శ్రీలంకలో చూడవలసిన వాటికోసం క్లిక్ చేయండి....