header

Kanipakam Sri Varasiddi Vinayaka Temple / కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం

Kanipakam vinayaka temple వక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఏ దేవుడి మీద ఒట్టు వేసినా నమ్మనివారు కూడా కాణిపాకం ఆలయ ఆవరణలో ఎవరైనా ప్రమాణం చేస్తేమాత్రం నమ్ముతారు. తరతరాలుగా సత్యప్రమాణాలు గల దేవునిగాచ భక్తుల పూజలు అందుకుంటున్న దేవుడు.
కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఇక్కడ హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

స్థలపురాణం
సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది.
రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.
ప్రమాణాల దేవుడు!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం
నిత్యం పెరిగే స్వామి
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం, ప్రస్తుతం స్వామివారికి సరిపోవటం లేదు.
స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.వెండికవచాల పరిమాణాలు మారుతుండటం ఇందుకు నిదర్శనం. కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.
బ్రహ్మోత్సవాలు
వినాయక చవితి నుండి ప్రారంభించే బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు సాగుతాయి. స్వామివారిని హంస, నెమలి, మూషిక, శేష, వృషభ, గజ, అశ్వ, నంది, రావణబ్రహ్మ, సూర్యప్రభ. చంద్రప్రభ, కామధేను, యాళి, కల్పవృక్ష వాహనాలపై ఊరేగిస్తారు. రధోత్సవం, పుష్పపల్లకీ సేవ, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి. బ్రహ్మహత్యా పాతక నివారణార్థం: స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారాని చెబుతారు. అద్భుత శిల్పకళ ఈ ఆలయానికి సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
ఎలావెళ్లాలి ?
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.ల దూరంలో ఐరాల మండలంలో ఉంది. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువ. ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలలో వెళ్లవచ్చు. దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి. దగ్గరలోని రైల్వే స్టేషన్లు తిరుపతి మరియు చిత్తూరు.
స్వామివారికి ప్రత్యేక పూజలు....వివరాలు తరువాత పేజీలో...