అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్తఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబర్ 7, 2005వ తేదీనభారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్"
వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా,ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు,
ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకు ప్రతీక. అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం.
వేదాలలో , ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".
నిర్మాణ కళాశైలి రాజస్తాన్ లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం.
మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ కు చెందిన గాంధీనగర్‌లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది. బదరీనాథ్, కేదార్నా థ్, సోమనాథ్,
కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్పూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే ఈ అక్షరధాంని మలచడం ఒక విశేషం