‘తెల్లని మంచుకొండల మధ్యలో పచ్చని మైదానాలూ ఎత్తైన వృక్షాలూ గలగలపారే నదులూ నీలి సరస్సులూ
కాశ్మీర్ యాత్రకి అనువైన సమయం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది పర్యటకుల వయసును బట్టి మారుతూ ఉంటుంది. విద్యార్థులకీ కొత్తగా పెళ్లయిన జంటలకీ పర్వతారోహకులకీ మార్చి 15 నుంచి మే వరకూ మంచి సమయం.
ఎందుకంటే వసంత రుతువులో కాశ్మీర్ మనోహరంగా కనిపిస్తుంది. కొండలమీద నుంచి మంచు కరిగి ప్రవహించే నదీప్రవాహాలు చల్లని పిల్లగాలులని మోసుకొస్తూ ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఆ సమయంలో విరిసే రంగురంగుల పూలూ, దూరంగా పర్వతశ్రేణులమీద కనిపించే మంచు సరస్సులూ పర్యటకుల్ని కళ్లు తిప్పుకోనీయవు.
నవంబరు నుంచి మార్చి వరకూ శీతాకాలం. ఆ సమయంలో లోయ అంతా మంచుతో కప్పబడిపోయి పర్వతాలపై తెల్లని దుప్పటి పరచినట్లుగా ఉంటుంది. చెట్లూ మైదానాలూ రోడ్లూ అన్నీ మంచుతో నిండిపోతాయి. అప్పుడు వింటర్ స్పోర్ట్స్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. చలికి తట్టుకోగలిగినవాళ్లకీ మంచులో ఆడుకోవాలనుకునేవాళ్లకీ ఇది మంచి సమయం.
మే నెల నుంచి ఆగస్టు వరకూ ఎండాకాలం. ఆ సమయంలో కాశ్మీర్లోనూ పగటివేళలో చెమటలు పట్టేస్తాయి. ఈ సీజన్లో ఉన్ని దుస్తుల అవసరం ఉండదు. చలికి తట్టుకోలేనివాళ్లకి ఇదే మంచి కాలం.
కాలి నడకనగానీ గుర్రాలమీద కానీ డోలీల్లోగానీ 14 కిలోమీటర్లు ప్రయాణించి 5,200 అడుగుల ఎత్తులోని త్రికూట పర్వతం పైన ఉన్న వైష్ణోదేవి మందిరాన్ని చేరుకుని అమ్మవారిని పూజిస్తారు. యాత్రకు బయలుదేరేముందు కాట్రాలో ఉన్న ఆఫీసుకి వెళ్లి అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులు దేవి దర్శనం చేసుకుంటారు. వేసవిలో అయితే మూడునాలుగు లక్షల వరకూ ఉంటారట. అనుమతి పత్రంమీద బ్యాచ్ నంబరు ఉంటుంది. దర్శనానికి ఒక్కోసారి రెండుమూడురోజులు కూడా పడుతుంది.
రాక్షసుల క్రూరత్వం నుంచి దేవతలను రక్షించడానికి త్రిమూర్తులవారి అంశతో ఓ బాలికను సృష్టించారట. ఆమె భూలోకంలో ఓ వైష్ణవుని ఇంట జన్మించిందట. ఆమె ఎప్పుడూ భగవధ్యానంలో సమయం గడుపుతూ ఉండేది. ఆమె అందచందాలకు ఆకర్షితుడైన భైరవుడు అనే రాక్షసుడు, తనను పెళ్లాడమని వేధించసాగాడట. అతన్నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక త్రికూట పర్వతంపైన ఉన్న ఓ గుహలో దాగి తపస్సు చేయసాగిందట. ఆమె మానవ గర్భం ఆకారంలో ఉన్న ప్రదేశంలో తపస్సు చేసిందట. దాన్నే గర్భజూన్ అంటారు. భక్తులు అందులోకి పాకుతూ ప్రవేశించి బయటకు రావడాన్ని ఆచారంగా పాటిస్తారు.
అక్కడ తొమ్మిది నెలలుగా తపస్సు చేసుకుంటున్న వైష్ణవిని గమనించి భైరవుడు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమె అదే పర్వతంమీద ఉన్న మరో గుహలోకి పరిగెడుతుంది. తనను వెంబడిస్తున్న భైరవుడు ఆ గుహలోకి ప్రవేశించగానే శక్తినంతా ప్రయోగించి శిరస్సుని ఖండిస్తుంది. ఆ శిరస్సు దూరంగా పోయి మరో కొండమీద పడుతుంది. అదే ప్రస్తుతం భైరవమందిరం ఉన్న ప్రదేశం. అంతట భైరవుడు ఆమెను సర్వశక్తిమంతమైన దుర్గగా గ్రహించి తన తప్పును మన్నించమని వేడుకోగా దానికి ఆమె సంతసించి తన దగ్గరే ఉండమని అనుమతినిస్తుంది. తనను దర్శించడానికి వచ్చిన భక్తులు భైరవుడిని చూడకపోతే యాత్రాఫలం దక్కదని అతనికి వరమిస్తుంది. ఆ తరవాత ఆమె తన శరీరాన్ని విడిచి మూడు శిలలుగా మారిపోతుంది. వాటినే దుర్గ, పార్వతి, సరస్వతీగా భక్తులు ఆరాధిస్తారు.
తరువాత పేజీలో.....