తెల్లగా మెరుస్తున్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా.
లక్షదీవులు పర్యాటక పరంగా పేరు పొందినవి. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే.
వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం ఒర అద్భతమైన అనుభూతి. సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి.
ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఆ దీవిని చూసిన తరువాత, ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడం, స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదా ఉన్నవారికి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.
ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో ఆడుకుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్... ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు.
ఇంకా కామత్ ఐలాండ్లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.
ఇంకా చూడవలసినవి.... హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి.
సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి.
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.
లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు.
లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది.
తరువాత పేజీలో .....