telugukiranam

Bhutan Tourism భూటాన్ పర్యాటకం

Bhutan Tourism భూటాన్ పర్యాటకం
bhutan tourism ప్రపంచ దేశాలలో ప్రజలు సంతోషకరంగా జీవనం గడిపే దేశాలలో భూటాన్ ఒకటి! కొండల్లో నెలకొన్న ఈ చిన్న దేశ జనాభా ఎనిమిది లక్షలకు లోపే. భూటాన్ ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే ఇష్టపడతారు.
భూటాన్ బౌద్ధమతానికి చెందిన దేశం. అన్నిచోట్లా బుద్ధిజం ఆనవాళ్లే! ఎక్కడ చూసినా బౌద్ధ మఠాలే కనిపిస్తాయి! పెద్ద, పెద్ద బౌద్ధ ఆరామాల్లో వందల మంది బౌద్ధ సన్యాసులుంటారు ¬పర్యావరణాన్ని పరిరక్షించడంలో వీరు అందరికన్నా ముందున్నారు.
బౌద్ధపథంలో నడిచే భుటాన్లో.. గాలి, నీరు, భూమి స్వచ్ఛం. ఆ భూమిలో పండే ఆహార ధాన్యాలు కూడా ఆరోగ్యకరమైనవే. సాగుబడి నూటికి నూరు శాతం సేంద్రియ బాటలో సాగుతోంది. ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా భూటాన్ గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే భూటాన్లో హిమాలయాల సోయగాలు, కొండలు, కోనలు.. ఎన్నో ఆకర్షణలు. పర్యాటక పరంగా ప్రభుత్వం.. మాస్ టూరిజాన్ని ప్రోత్సహించదు. పర్యాటకులను ఎక్కువగా ఇష్టపడరు కారణం వాతావరణం కలుషితమౌతుందని. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి సాధించే అభివృద్ధి అవసరం లేదంటారు. ‘పర్యాటకులు.. భూటాన్ ను పర్యాటక కేంద్రంగానే చూస్తారు. కానీ పర్యావరణ ప్రేమికులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం, ఆదరిస్తాం’ అంటారు భూటానీయులు.
భూటాన్ రాజధాని థింపూ. రాజధానిలో విమానాశ్రయం లేదు. దేశంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పారో నగరంలో ఉంది. పారో నుంచి రాజధానికి దూరం 55 కిలోమీటర్లు. చుట్టూ కొండలు, గుట్టలతో ఉండే పారో విమానాశ్రయంలో దిగగానే మంచుతెరలు స్వాగతం పలుకుతాయి. మంచుతెరల చాటు నుంచి ఆకాశాన్నంటే పర్వతాలు కనువిందు చేస్తాయి. పారో ఎయిర్పోర్ట్ నుండే పర్యాటకులకు ఆనందం మొదలవుతుంది. కొండల నడుమ ఉన్న లోయలో పారే పారో నది, తీరం వెంట విస్తరించిన జనావాసాలు, బౌద్ధారామాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పారోలో నేషనల్ మ్యూజియం, పురాతన కట్టడాలు చూడదగ్గవే!
థింపూలో రెస్టారెంట్లు బాగుంటాయి. భారతీయ వంటకాలూ లభిస్తాయి. శాకాహారులకు ఆర్గానిక్ ఫుడ్ అందుబాటు ధరలోనే లభిస్తుంది. 51.5 మీటర్ల బుద్ధుడి కాంస్య విగ్రహం థింపూలో ప్రధాన ఆకర్షణ. అనుభవమున్న ట్యాక్సీ డ్రైవర్ను లేక గైడ్ను చూసుకుంటే.. భూటాన్ పర్యటన మరింత సంతోషంగా సాగిపోతుంది. ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లాలన్నా.. వంద కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది. టాంగో, చెరి మఠాలు, డోకులా పాస్, పునాఖా ఇవన్నీ థింపూ నుంచి 50-80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పునాఖాలో భూటాన్ జానపద వైభవాన్ని చూడవచ్చు. ఇది ఒకప్పుడు భూటాన్ రాజధాని. పునాఖా నుంచి థింపూ మీదుగా పారో చేరుకుంటే భూటాన్ పర్యటన ముగిసినట్టే!
శిఖరాగ్ర ఆరామం
పారో పరిసరాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనది టైగర్ నెస్ట్ అనబడే తక్త్సంగ్ మఠం. ఈ బౌద్ధారామాల సమూహం పారో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన పర్వతంపై ఉన్నాయి. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో పద్మసంభవ అనే బౌద్ధ గురువు ఇక్కడ ధ్యానం చేశాడని చెబుతారు. 16వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాలు కట్టబడ్డాయి. పదివేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతంపైకి ఎక్కడం సాహసమే. కొండపైకి మెట్ల మార్గం ఉంది. ఏటవాలుగా ఉండే మెట్లు ఎక్కాలంటే కష్టపడాల్సిందే ! భూటాన్ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో చాలామంది తిరుగు ప్రయాణంలో టైగర్ నెస్ట్ సందర్శిస్తారు.
తరువాత పేజీలో........