ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాను పూర్వం కంపూచియాగానూ కాంభోజ రాజ్యంగానూ పిలిచేవారు. ఫునమ్ ఫెన్ - కంబోడియా రాజధాని.
ఇక్కడి కరెన్సీ కంబోడియన్ రియాల్స్ కానీ కంబోడియాలోని లావాదేవీలన్నీ అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. స్థానిక కరెన్సీ ఎవరూ ఎక్కువగా వాడరు. అధికారక భాష ఖ్మేర్.
కంబోడియా అధికార మతం " తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు మరియు 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని మరియు దేశంలోని అతి పెద్ద నగరమైన " నాంఫెన్" కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది
పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం ఒకటి.
సంస్కృతీసంప్రదాయాలకూ ఆచారవ్యవహారాలకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచే చూడచక్కని పట్టణమే సియాంరీప్. ఇప్పటికీ దీని చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శకులకోసం ప్రాచీన ఖ్మేర్ సామ్రాజ్యకాలంనాటి చెక్క ఇళ్లను యథాతథంగా పరిరక్షిస్తున్నారు. కంబోడియాలో నివసించే ప్రత్యేక జాతి ప్రజల్నీ వాళ్లు మాట్లాడే భాషనీ ఖ్మేర్ అని పిలుస్తారు.
అంగ్ కోర్ వాట్ కంబోడియాలోనిప్రపంచ ప్రసిద్ధిపొందిన ప్రాచీన విష్ణుదేవాలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగాగుర్తించబడినది. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ 2 దీనిని నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడిందిప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం.
ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంబోడియా లోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ కంబోడియా జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్య పాలనలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందినది.