telugukiranam

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం
నేపాల్‌... మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. భారత దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉన్నది ఇక్కడే. మౌంట్‌ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు. నేపాల్‌బుద్ధుడి జన్మస్థలం. క్రీస్తు పూర్వం 563లో గౌతమ బుద్ధుడు ఇక్కడ లుంబినిలో జన్మించాడు. ఈ ప్రాంతం బౌద్ధులకు పవిత్రస్థలం.
నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండ్ విస్తీర్ణం 1,47,181చదరపు కిలోమీటర్లు. వీరి భాష నేపాలీ కరెన్సీ నేపాలిస్‌ రూపాయి. భారతదేశ రూపాయి కంటే విలువ తక్కువగా ఉంటుంది. ఈ దేశానికి స్వాతంత్య్ర దినం లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడూ పరాయి దేశాల పరిపాలనలో లేదు.
నేపాల్‌ జాతీయ జంతువు ఆవు. ఆవును చాలా పవిత్రంగా భావిస్తారు గోవధ ఇక్కడ నేరం.
ఈ దేశంలో గౌరవంగా పలకరించడానికి కరచాలనం ఇవ్వరు. రెండు చేతులు జోడించి నమస్తే చెబుతారు.
ప్రపంచంలో ఏ దేశ జెండా అయినా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కానీ నేపాల్‌జెండా అందుకు భిన్నం. నీలం అంచుతో ఉండే ఎరుపు రంగు త్రిభుజాకారాలు రెండు ఉంటాయి. వీటిల్లో ఒకటి చంద్రుడికీ, మరోటి సూర్యుడికీ సూచిక.
ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్‌ లౌకికరాజ్యంగా మారింది. ఇప్పటికి కూడా 81 శాతం మంది హిందువులు ఉన్నారు. ఎన్నోమతాలు సామరస్యంతో కలిసి నివసిస్తున్నారు.
రామాయణ కధానాయకుడు శ్రీరాముని భార్య సీతాదేవి జన్మస్థలం నేపాలే.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు ఉంది ఈ దేశంలోనే. మహాపాదిగా చెప్పుకునే ‘యతి’ ఈ దేశ హిమాలయాల్లో కనిపించినట్టు చెబుతారు. జీవ వైవిధ్య పరంగా ఈ దేశం ముందంజలో ఉంది. ఇక్కడ వేలాది రకాల జీవులుంటాయి. 900 రకాల పక్షి జాతులుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి జాతుల్లో 8.9 శాతం ఇక్కడే కనిపిస్తాయి. 4.2 శాతం సీతాకోక చిలుకలు, 3.96 క్షీరదాలు ఉంటాయి. అందుకే నేపాల్‌ని ‘అమెజాన్‌ఆఫ్‌ఆసియా’గా పిలుస్తారు.
నేపాల్ పర్యటన
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. అక్కడి ప్రకృతి రమణీయత. హిందు మతస్తులకు, బౌద్ధ మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు, ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నేపాల్ ప్రజల స్నేహపూరిత స్వభావం కలవారు. ఆకాశానికి తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఉన్న నేపాల్ పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే.
పోక్రా
నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో సుందరంగా ఉంటుంది. పట్టణానికి కొంచెం దూరంలో మంచుతో కప్పబడిన హిమాలయా పర్వతాలు కనువిందు చేస్తాయి. వెండి కొండలవలె ప్రకాసిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన ప్రయాణ సౌకర్యం ఉంది. చిన్న విమానాలలో హిమాలయాలకు కొద్దిగా దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్ లాండ్ తో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ లాండ్ అని అంటారు. హిమాలయాల అందాలను చూడ డానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగులు చిమ్ముతుంది. ఆ దృశ్యం అత్యంత నయానంద కరం.
దేవి జలపాతం
ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరిలోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతులోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదేవిదంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో తెలియదు. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనే ఉంది.
కాఠ్మండ్
కాఠ్మండ్ నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాజధాని. కానీ పెద్ద పట్టణమైనా భారతదేశ పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదే. బహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షణ అక్కడి జూద గృహాలు. వీటిని కాసినోలు అంటారు.
మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు.
ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది మనోకామన దేవాలయ పోక్రా నుండి ఖాట్మండుకు వెళ్లే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులో ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే" ఏర్పాటు చేయబడి ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి.
ఈ రోప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసులోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతువధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్తసిక్తంగా వుంటుంది. గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండపై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.
తరువాత పేజీలో........