దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. చిన్న ద్వీపం దేశం. మలేషియాకు దక్షిణాన ఉంది. దక్షిణ ఆసియాలో సింగపూర్ అతి చిన్న దేశం.
1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయము. పర్యాటకముగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.
సింగపూర్... పేరు వినగానే సందర్శకులకు అందాల సెంటోసా దీవి, అతిపెద్ద జెయింట్వీల్, మరీనా బే శాండ్స్, చైనాటౌన్, నైట్ సఫారీ
లిటిల్ ఇండియా... ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తుకొస్తాయి. వాటిలో కొన్ని.......
నైట్ సఫారీ అంటే రాత్రివేళలో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. జంతుప్రదర్శనశాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటము పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.
ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అద్భుతమైన ఈ ప్రదర్శన పర్యాటకులనెంతో ఆకర్షిస్తుంది.అలాగే అనేక రకముల పక్షులను ఇక్కడ సందర్శించ వచ్చు. గద్ద తన ఆహారాన్ని ఎలా వేటాడుతుందో ఇక్కడ సందర్శకుల కోసము ప్రదర్శిస్తూ ఉంటారు.అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తము చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటము ఒక అద్భుతమైన ఆకర్షణ.
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్లాయన్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ వాటర్ వరల్డ్ ఇంకొకటి. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్ లలో 12 గంటల టూర్, మరియు రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో డాల్ఫిన్ షో లను జరుపుతూ ఉంటారు.
లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్
ఇవి చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్ లలో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడ అనేక మతాలకు సంబంధించిన గుడులు ఆయా సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తూ భక్తులను అలరిస్తుంటాయి. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభిస్తుంది.
విమానం దిగగానే ముందుగా చూడాల్సింది అక్కడి చాంగి విమానాశ్రయం. అది ఓ సుందరలోకం... ప్రయాణికులు స్వర్గధామంగా భావించే అద్భుత పర్యటక ప్రదేశం..!
ఆవిమానాశ్రయంలో అడుగుపెడితే, టెక్నాలజీప్రియులూ ప్రకృతి ప్రేమికులూ షాపింగ్ లవర్లూ అయిన పర్యటకులకి సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఎందుకంటే పేరుకే అదో విమానాశ్రయం. కానీ ఉద్యానవన విహారానికీ విందువినోదాలకీ పెట్టింది పేరు. అందుకే ప్రపంచంలోకెల్లా ఉత్తమ విమానాశ్రయంగా ‘స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్’ సంస్థ అందించే అవార్డును వరసగా ఐదోసారీ గెలుచుకుంది. 1981లో ప్రారంభమైననాటి నుంచి నేటి వరకూ 533 పురస్కారాల్ని దక్కించుకుంది.
ఈ విమానాశ్రయం కోసమే తయారుచేసిన ఆర్కిడ్ టీ పెర్ఫ్యూమ్ని అన్నిచోట్లా చల్లడంతో లోపలకు వెళ్లగానే ఒకరకమైన పూల పరిమళం గుబాళిస్తూ ఏ దేవలోకంలోకో అడుగుపెడుతోన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవలే నాలుగో టెర్మినల్నీ సొంతం చేసుకున్న ఈ ఎయిర్పోర్టు, యాభై వేలమంది సిబ్బందితోనూ వేలాది ప్రయాణికులతోనూ నిత్యం కళకళలాడుతుంటుంది. అక్కడి నుంచి ప్రతి 90 సెకన్లకీ ఒకటి చొప్పున వారానికి ఏడు వేల విమానాలు వచ్చిపోతుంటే, ఏటా దాదాపు ఆరుకోట్లకు పైగా ప్రయాణికులు ఎక్కి దిగుతుంటారు.