పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం ధాయ్ లాండ్. దీని రాజధాని బ్యాంకాక్. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ధాయ్. వీరి కరెన్సీ పేరు బాత్. థాయ్లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్లాండ్ గా పిలువబడుతుంది. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉంది. థాయ్లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్, కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్, మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి
థాయ్లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు మరియు 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు.. బౌద్ధమతాన్ని థాయ్లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు.
ఈ దేశంలో బౌద్ధమతస్తులు ఎక్కువ. ఎక్కడ చూసినా బుద్ధుని దేవాలయాలు, విగ్రహాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధవిగ్రహం కూడా ధాయ్ ల్యాండ్ లోనే ఉంది. రాజధాని బ్యాంకాక్ ను వెనిస్ ఆఫ్ ది వెస్ట్ అని పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడ కాలువలు ఎక్కువగా ఉండటమే.
వీరి ప్రధాన ఆహారం వరి. వరి ఎక్కువగా పండుతుంది. బియ్యం ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలలో ధాయ్ లాండ్ కూడా ఒకటి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారాలు అన్నింటికి చేర్చుకుంటారు
అతిపెద్ద మొసళ్ల కేంద్రం ధాయ్ ల్యాండ్ లోనే ఉంది. ఏనుగులు కూడా ధాయ్ ల్యాండ్ లో ఎక్కువ.
ధాయ్ లాండ్ అంటే ల్యాండ్ ఆఫ్ ది ఫ్రీ అని అర్ధం. ఆగ్నేయ ఆసియాలో యూరోపియన్ల ఆధీనంలోకి రానిది ఇదొక్కటే.
ఇక్కడ మడ్ స్కిప్పర్ అనే ఒక ప్రత్యేకమైన జాతి చేప ఉంది. ఈ రకమైన చేపలు నేలమీద నడవగలవు, చెట్లు కూడా ఎక్కగలవు. ప్రపంచంలోని ప్రమాదకరమైన, పొడవైన కింగ్ కోబ్రాలు ఎక్కువ. ఈ కింగ్ కోబ్రాలు సుమారు 18 అడుగుల దాకా ఉంటాయి. వీటి విషం అత్యంత ప్రమాదకరమైనది. ఒక్క కాటుతో ఏనుగును సహితం చంపగలవు.
నకోన్ రాచసీమ రాష్ట్రంలో క్రీ.శ 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివలింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాతి కాలంలో విమయ, పిమాయ్గా మారింది. హిందూఖేమర్ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు.
దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్ - బ్యాంకాక్ మధ్య చావ్ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయుతయ... మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది.
దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కౌయాయ్ రీజియన్ . ప్రత్యేక వాహనాల్లో వైన్ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్ డెయిరీ ఫామ్సకి కూడా ప్రసిద్ధి చెందినది. చోక్చాయ్ ఫామ్ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ.
సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు... ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు.
సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్, ఐస్క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్చాయ్ ఫామ్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.
థాయ్లో పట్టాయాలో బీచ్ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్టు, హోటల్ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, కౌబాయ్ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్లెట్, లోటస్ మాల్స్ వంటి షాపింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్ మాల్లో ఏదీ కొనకుండా విండో షాపింగ్ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్ ప్రాంతంలోనే ఉన్న డాన్క్వియాన్ ప్రాంతం పాటరీకి ప్రసిద్ధి.
మరకత బుద్ధుడు థాయ్ టూర్లో మరో ప్రత్యేకత బ్యాంకాక్లో ఎమరాల్డ్ బుద్ధుడిని చూడడం. వాట్ ప్రాకయో (ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకత బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్లో చావ్ప్రాయ నది ఒడ్డున ఉంది.
చావ్ప్రాయ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్ అరుణ్ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్య కాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలి యన్శైలిలో ఉన్న థాయ్ రాజపస్రాదం ఆనంద సమక్రోమ్ కూడా చూసి తీరాల్సిన కట్టడమే.
బ్యాంకాక్లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్ థామ్సన్ హౌస్ మ్యూజియం, సువాన్ పక్కడ్ ప్యాలెస్ మ్యూజియం ఉన్నాయి. సువాన్ పక్కడ్ మ్యూజియం ప్రాచీన థాయ్ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరిం చిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి.