header

Kerala Tourism / కేరళ పర్యాటకం

కేరళ రాష్ట్రం పర్యాటకానికి మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, మంచినీటి సరస్సులు, సముద్ర తీరాలు, కాలువలు, లంకలు మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి కేరళ రాష్ట్ర పర్యటన మనోహరం, ఆహ్లాదకరం.
నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ట్రావెల్ ప్లస్ లీషర్ సంస్ధ మేగజైన్ అయిన ట్రావెలర్, కేరళ రాష్ట్రాన్ని ప్రపంచంలోని పది స్వర్గాలలో ఒకటిగాను, జీవితంలో చూడవలసిన 50 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగాను, 21వ శతాబ్దంలోని 100 అతి గొప్ప పర్యటనలలో ఒకటిగాను పేర్కొంది.
పర్యాటక ప్రాంతాలు
కేరళను దేవుడి స్వంత దేశం అంటారు. కేరళలోని కాసర్ గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలపుజ (అలెప్పీ), పాతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం అనే 14 జిల్లాలలోని పర్యాటక ప్రదేశాలు, పర్యాటకులను తృప్తి పరుస్తాయి.
కేరళలోని ఇసుక తిన్నెలతో కూడిన బీచ్ లు, బ్యాక్ వాటర్స్, పర్వత ప్రదేశాలు వంటివి విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి స్వర్గధామాలు.
సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి లేదా ప్రశాంతతతో ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారికి లేదా రసమయ జీవితంలో ఓలలాడాలనుకునే జంటలకు, కేరళ ఒక మజిలీ అని చెప్పవచ్చు.
కేరళ లోని నీటి మార్గాలు ....
వర్కాల, బేకాల్, కోవలం, మీనకున్ను, షెరాయ్ బీచ్, పయ్యంబాలం బీచ్, శంగుముఖం, ముజుప్పిలంగాడ్ బీచ్, మొదలగునవి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే బీచ్ లు. కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ, కుమరకోం, తిరువల్లం, కొల్లం, కాసర్ గోడ్, మొదలైన చోట్ల కలవు. ఈ ప్రదేశాలు బ్యాక్ వాటర్ అనుభవాలకు ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతులిస్తాయి. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలములు మరియు హౌస్ బోట్లు ఉపయోగిస్తారు. హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా వీటిని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. బ్యాక్ వాటర్ రిసార్టులు కూడా ఇక్కడ కలవు.
సాంప్రదాయక స్నేక్ బోట్ రేసు ప్రతి ఏటా కేరళలో జరుగుతుంది. దీనిని చూసి ఆనందించేందుకు అనేకమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు. వెంబనాడు సరస్సు, అష్టముడి సరస్సు, పూకోడు సరస్సు, సష్టంకొట్ట సరస్సు, వీరనపూజ వెల్లాయని సరస్సు, పరవూర్ కాయల్, మనచిరా, మొదలైన సరస్సులు కేరళను మరింత అందంగా చూపి పర్యాటకులను ఆకర్షిస్తాయి. వెంబనాడు సరస్సు భారతదేశంలోని అతి పెద్ద సరస్సులలో ఒకటిగా చెపుతారు.
కేరళ హిల్ స్టేషన్లు- అద్భుతాలు.......
కేరళలోని అందమైన మున్నార్ హిల్ స్టేషన్ నేటికి ఎంతో పవిత్రంగా కనపడుతుంది. దక్షిణ ఇండియాలోని ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే, ఈ ప్రదేశంలో వాణిజ్య కలాపాలు చాలా తక్కువ. హనీమూన్ జంటలకు ఈ ప్రదేశం సరైనది. వయనాడ్ కు సమీపంగా ఉంది. వాగమన్, పొన్ముడి, ధెక్కడి, పీర్ మేడ్, మొదలై ఇతర హిల్ స్టేషన్లు కూడా పర్యాటకులు ఆనందించవచ్చు. ధెక్కడి ప్రదేశం వన్యజీవులకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి.
సంస్కృతి, ఆహారాలు, వేష భాషలు......
కేరళ సంస్కృతి భారతీయ సంస్కృతికి ఎంతో భిన్నంగా కనపడుతుంది. వివిధ రీతుల కళలు, ఆహారాలు, దుస్తులు మొదలైనవి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కేరళ రాష్ట్రం అనేక నృత్యాలకు పుట్టినిల్లు. డ్రామాలు, జానపద కళలు, మొదలైనవి కూడా ఆసక్తికరం.
కేరళకు చెందిన కధాకళి మరియు మోహినియాట్టం వంటివి ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ప్రసిద్ధి చెందిన నాట్యాలు మత పర మూలాలు కలిగి ఉంటాయి. క్రైస్తవుల పరిసముత్తు మరియు వచిట్టు నాదకోం, ముస్లిం మతస్తుల ఒప్పన మరియు హిందూ మతస్తుల కూడియాట్టం వంటివి మత సంబంధ కళలుగా ప్రసిద్ధి కెక్కాయి. కేరళ ప్రజలకు కర్నాటక సంగీతం లో మంచి అనుభవం కలదు. కేరళ ప్రజలువారి సాంప్రదాయ దుస్తులైన ముండు అంటే బాగా ఇష్టపడతారు.
ఇక కేరళ ప్రజల ఆహారాలు పరిశీలిస్తే, పుట్టు, ఇడియప్పం, ఉన్ని అప్పం, పలడాయ్ ప్రధమన్ (ఒక రకమైన పాయసం), అరటికాయ చిప్స్, చేపల వంటకాలు, ఎర్రటి బియ్యం వంటివి కేరళ ప్రజల విభిన్న రుచులుగా రాష్ట్రంలో ప్రసిద్ధి కెక్కాయి. ఒక అరటి ఆకుపై వివిధ రకాల రుచికర వంటకాలు పెట్టి అందించేదాన్ని వారు సధ్య అంటారు. కేరళలోని ప్రధాన పండుగ అయిన ఓణం పండుగకు ఓణం సధ్య తయారు చేసి ఆనందిస్తారు.
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం మతాలు కేరళలో ప్రధానంగా కలవు.
కేరళలో పూజలకు సంబంధించి పరిశీలిస్తే, అనేక దేవాలయాలు అమ్మవార్లు లేదా వారు పిలువబడే భగవతికి సంబంధించి ఉంటాయి. చొట్టనిక్కర భగవతి దేవాలయం, అట్టుకల్ భగవతి దేవాలయం, కొడుంగల్లూర్ భగవతి దేవాలయం, మీన కులతి భగవతి దేవాలయం, మంగోట్టు కావు భగవతి దేవాలయం మొదలైనవి భగవతి దేవాలయాలలో ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాలకు కేరళ రాష్ట్రంలోని వారే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వేలాది భక్తులు వచ్చి పూజలు చేస్తారు.
గురువాయూర్ శ్రీ క్రిష్ణ దేవాలయం దేశవ్యాప్తంగా భక్తులకు దైవ భక్తిని కలిగిస్తోంది. ఇక శబరిమలైలోని అయ్యప్ప దేవాలయం గురించి తెలియని వారుండరు. దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రంగా చెప్పబడుతుంది.
కేరళలోని త్రిస్సూర్ లో కల అయిరానికులం మహదేవ దేవాలయం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం తిరువాళ్ళ శ్రీవల్లభ దేవాలయం, మొదలైనవి కూడా ప్రసిద్ధ దేవాలయాలే. కేరళ దేవాలయాల ఉత్సవాలలో భాగంగా, అక్కడి ఏనుగులు తమ వీపులపై అంబారీలు ధరించి వాటిలో దేవుడి విగ్రహాల ఊరేగింపు చేయటం అచ్చమైన భారతీయ దేవాలయాల సంప్రాదాయంగా కనపడుతుంది.
జగద్గురువుగా కీర్తించబడే ఆది శంకరా భగవత్పాదుల జన్మతో కేరళ మరింత పుణ్య భూమిగా మారింది. హిందూ మతానికి అద్వైత వేదాంతాన్ని అందించిన ఈ పరమ పూజ్యులు కేరళలోని కలాడిలో జన్మించి కేరళకే పేరు తెచ్చారు.
మలయతూర్ చర్చి, కొచ్చి లోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, కొచ్చి కోటలోని శాంతా క్రజ్ బాసిలికా, కొట్టాయం వద్ద కల సెయింట్ మేరీస్ ఫోరెన్స్ చర్చలు కేరళలో ప్రసిద్ధి గాంచినవి. పజయన్ గాడి మసీదు, మాదాయి మసీదు, చెరమాన్ జుమా మసీదు, కంజీరమాటం మసీదు, మాలిక్ దినార్ మసీదులు ముస్లింలకు ప్రధాన మసీదులు.
కేరళ సందర్శన పర్యాటకులకు ఓ జీవితకాలపు మధురానుభూతిని మిగులుస్తుంది.

Places to be visit / చూడవలసిన ప్రదేశాలు

Idukki / ఇడుక్కి

Kochi / కొచి

Kottayam / కొట్టాయం

Malappuram / మలప్పురం

Tiruvanthapuram / తిరువంతపురం

Vellayani Lake / వెల్లాయని సరస్సు

Munnar Hill Station / మున్నార్

Kovalam Beach / కోవళం బీచ్...